బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి | - | Sakshi
Sakshi News home page

బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి

Nov 1 2026 12:09 AM | Updated on Nov 1 2026 12:09 AM

సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా మైక్రో అబ్జర్వర్లు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఎం.గౌతమి అన్నారు. ఈ మేరకు శనివారం రాజమహేంద్రవరంలోని వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన గౌతమి మాట్లాడుతూ సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియను నిశితంగా పరిశీలించాలన్నారు. పోలింగ్‌ సిబ్బంది ఎన్నికల నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తిస్తున్నారో లేదో గమనించాలన్నారు. జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎం.రాజు మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాల్లో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా, శాంతిభద్రతలకు విఘాతం కలిగినా అనుసరించాల్సిన ప్రామాణిక నిర్వహణ విధానాలను తెలుసుకోవాలన్నారు. ఎల్‌డీఎం డీవీ ప్రసాద్‌, కొవ్వూరు డివిజన్‌ అభివృద్ధి అధికారి కె.శ్రీనివాసరావు, రాజమహేంద్రవరం డివిజన్‌ అభివృద్ధి అధికారి పి.వీణాదేవి తదితరులు మాట్లాడారు. పోలింగ్‌ విధానంపై మాస్టర్‌ ట్రైనర్లు అవగాహన కల్పించారు.

ఎన్నికల భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): మండపేట, కొవ్వూరు, నిడదవోలు మున్సిపాలిటీల ఎన్నికల నేపథ్యంలో శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఎన్నికల భద్రతా ఏర్పాట్లను ఎస్పీ డి.నరసింహ కిశోర్‌ పర్యవేక్షించారు. డ్రోన్లు, సోలార్‌ కెమెరాలు, బాడీ వార్న్‌ కెమెరాల ద్వారా అందుతున్న ప్రత్యక్ష దృశ్యాలను పరిశీలించి, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ పాటిల్‌ దేవరాజ్‌ మనీష్‌ పాల్గొన్నారు.

డీవీఈఓగా మేరీ సుజాత

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): డిస్ట్రిక్ట్‌ వొకేషనల్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ (డీవీఈఓ)గా బి.మేరీ సుజాత నియమితులయ్యారు. ఇప్పటివరకు పనిచేసిన డి.విజయశ్రీ ఉద్యోగ విరమణ చేయడంతో ఆ స్థానంలో పూర్తి బాధ్యతలను శనివారం మేరీ సుజాత స్వీకరించారు. ఆమె డీవీఈవో హోదాలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు సంబంధించిన జనరల్‌, వొకేషనల్‌ విద్యా విభాగాలను పర్యవేక్షిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement