చాగల్లు: అర్నబ్ తుపాను ప్రభావంతో సంభవించిన పంట, ఆస్తి నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించింది. కొవ్వూరు మండలం దొమ్మేరులో దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలను బృందంలోని సభ్యులు పరిశీలించారు. నేలకొరిగిన అరటి తోటలు, దెబ్బతిన్న బొప్పాయి చెట్లు, వరి పంట పరిస్థితిని పరిశీలించి రైతులతో మాట్లాడారు. అరటి తోటల్లో గెలలతో సహా చెట్లు నేలకొరిగాయని, గాలుల కారణంగా పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వివరించారు. హైదరాబాద్‌కు చెందిన రేఖారాణి కొల్లు ఆధ్వర్యంలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇస్రో, హైదరాబాద్‌కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్‌వీఎస్‌పీ శర్మ, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ అలోక్ జవహర్, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ రాకేష్‌కుమార్ సింగ్ తదితరులు ఈ బృందంలో ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, సహాయ కలెక్టర్ కె.ఆదిత్య శర్మ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎన్.మల్లికార్జునరావు, ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ ఎ.దుర్గేష్ పాల్గొన్నారు.
జాగ్రత్తలతో పంట రక్షణ
రాజమహేంద్రవరం రూరల్: తుపాను నేపథ్యంలో వరి పంటకు జరిగే నష్టాన్ని తగ్గించుకోవడానికి రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మారుటేరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్తలు చల్లా వెంకట నరసింహరావు, డి.శేఖర్ తెలిపారు. ఈ మేరకు శనివారం రూరల్ మండల వ్యవసాయ అధికారి ఎ భీమరాజుతో కలిసి కాతేరు, తొర్రేడు, వెంకటనగరం గ్రామాల్లో దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించారు. ప్రస్తుతం పంట పూత దశ, పాలు పోసుకునే దశ, గింజ గట్టిపడే, కోత దశల్లో ఉందని, దానికి అనుగుణంగా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
● పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా కాలువల ద్వారా త్వరగా బయటకు పంపాలి. కోతకు సిద్ధంగా ఉన్న పంటలో నీటి నిల్వను నివారించాలి.
● ఆర్‌జీఎల్ 2537, బీపీటీ 5204 వంటి రకాల్లో వర్షం తగ్గిన తర్వాత ఎండ తీవ్రత పెరిగితే ఎండాకు, మానిపండు, మాగుడు తెగుళ్లు, ఆకుముడత పురుగు, దోమపోటు వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. పంటను ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన నివారణ చర్యలు చేపట్టాలి.
● గింజలు రంగు మారకుండా, మాగుడు తెగులు, మానిపండు తెగులు వ్యాప్తిని తగ్గించడానికి ఎకరాకు 200 మి.లీ. ప్రోపికోనాజోల్ పిచికారీ చేయాలి. కంకులపై మొలకలు కనిపిస్తే, పొలంలోని నీటిని తొలగించిన అనంతరం 5 శాతం ఉప్పు ద్రావణాన్ని (50 గ్రాముల ఉప్పు/లీటరు నీరు) పిచికారీ చేయాలి.
● మాగుడు తెగులు నివారణకు హెక్సాకోనాజోల్ 400 మి.లీ./ఎకరాకు లేదా ప్రోపికోనాజోల్ 200 మి.లీ./ఎకరాకు పిచికారీ చేయాలి. మానిపండు తెగులు నియంత్రణకు ప్రోపికోనాజోల్ 200 మి.లీ./ఎకరాకు పిచికారీ చేయాలి. ఆకుముడత పురుగును నివారించడానికి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 400 గ్రాములు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 60 మి.లీ.ను 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకు పిచికారీ చేయాలి


