చాగల్లు: తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. ఆయన శనివారం కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో పర్యటించి, దెబ్బతిన్న అరటి, వరి చేలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతేడాది మొంథా తుపానుతో రైతులు తీవ్రంగా నష్టపోతే ప్రభుత్వం ఇప్పటికీ పరిహారం చెల్లించకుండా దగా చేసిందన్నారు. గత వైఎస్సార్ సీపీ పాలనలో నష్టం జరిగిన నెల రోజుల్లోనే పరిహారం అందించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు పక్షపాతిగా నిలిచారన్నారు. గత ప్రభుత్వం ఉచిత పంటల బీమాతో ఆదుకోగా, ప్రస్తుత ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేయడంతో చాలామంది రైతులు బీమా ప్రీమియం చెల్లించలేదన్నారు. దీంతో పంట నష్టపోతే పరిహారం అందని పరిస్థితి నెలకొందన్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి బండి అబ్బులు, మాజీ ఎంపీటీసీ ముదునూరి నాగరాజు ఉన్నారు.


