చాగల్లు: కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ప్రజలకు ఆశించిన స్థాయిలో సంక్షేమం అందలేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. కొవ్వూరు మండలం దొమ్మేరులో జెడ్పీటీసీ అభ్యర్థి బండి పట్టాభి రామారావు(అబ్బులు), ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ముదునూరి నాగరాజు, ఎంపీటీసీ అభ్యర్థులు మామిడిపల్లి లక్ష్మి, కొవ్వలి వెంకట సత్యభారతి, పెరిచర్ల వరలక్ష్మి పాల్గొన్నారు.


