ఎన్నికల వేళ ఏం చెప్పారంటే... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ 50 ఏళ్లకే పింఛన్లు అందిస్తాం. వారందరికీ ఆర్థిక భరోసా కల్పిస్తాం. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తాం.
ఎన్నికలయ్యాక ఏం చేశారంటే...
50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో ఒక్కరికీ పింఛన్ ఇవ్వలేదు. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ ఒక్కరికీ కొత్తగా పింఛన్ ఇవ్వలేదు. వృద్ధాప్య పింఛన్ అందుకుంటున్న భర్త చనిపోతే స్పౌజ్ కింద భార్యకు వితంతు పింఛను ఇచ్చారే తప్ప కొత్తగా ఎవరికీ ఆర్థిక భరోసా కల్పించలేదు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా 1.5 లక్షల మంది 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఆశగా ఎదురు చూస్తున్నారు. 60 ఏళ్లు నిండిన వారినే పట్టించుకోని చంద్రబాబు అండ్ కో... ఇక 50 ఏళ్లకే పింఛన్ ఎక్కడిస్తారు. అసలు ఆ హామీ ఇచ్చామన్న విషయమే కూటమి నాయకులకు గుర్తు లేదు. అందువల్లే ఈ రెండున్నరేళ్లలో ఎంతగా సొంత డబ్బా కొట్టుకుంటున్నా 50 ఏళ్లకే పింఛన్ విషయాన్ని మాత్రం ఎక్కడా ప్రస్తావించడమే లేదు.


