సాక్షి, రాజమహేంద్రవరం: స్థానిక ఎన్నికలకు ప్రచార పర్వం ముగిసింది.. తెరవెనుక వ్యవహారాలకు కూటమి సిద్ధమైంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సన్నద్ధమువుతోంది. కొవ్వూరు, నిడదవోలు, మండపేట మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థులకు ప్రజా వ్యతిరేకత భయం పట్టుకుంది. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్ అండ్ కో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడం, సన్నబియ్యం ధరల భారంతో ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి కూటమి అభ్యర్థులను కలవరపెడుతోంది. దీంతో చివరి అంకంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం పంపిణీకి తెరవెనుక వ్యూహాలు సిద్ధం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మున్సిపల్ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ఆదివారం పోలింగ్ జరగనుంది. ప్రచారానికి, పోలింగ్‌కు మధ్య ఉన్న సమయం అభ్యర్థులకు అత్యంత కీలకంగా మారింది. ఈ వ్యవధిలో ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు అన్ని మార్గాలనూ అన్వే షిస్తున్నారు. ముఖ్యంగా కొవ్వూరు, నిడదవోలు, మండపేటలో ఓటమి భయం కూటమి నేతలను వెంటాడుతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు గత రెండున్నరేళ్లలో ఇసుక అక్రమ తవ్వకాలు, మద్యం అధిక ధరలకు విక్రయించడం ద్వారా కొందరు నాయకులు భారీగా ఆర్జించారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు అదే అక్రమ సొమ్మును ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఓటుకు నోటు, మద్యం సీసాల పంపిణీ ద్వారా ప్రజాతీర్పును ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తున్నారనేది స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. శుక్రవారం రాత్రి నుంచి పోలింగ్‌కు ముందు వరకు ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారనే సమాచారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
కూటమి అభ్యర్థులకు అదే భయం
ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలుకు నోచుకోకపోవడం కూటమి అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారింది. మహిళలకు ఆడబిడ్డ నిధి, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లు, నిరుద్యోగులకు భృతి, ఇంటింటికీ మూడు ఉచిత సిలిండర్లు, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు వంటి హామీలు అమలు కాక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు నిత్యావసరాల ధరలు, బియ్యం ధరలు పెరగడంతో సామాన్య కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది. ఈ అసంతృప్తి ఓట్ల రూపంలో బయటపడుతుందేమోనన్న భయం కూటమి నేతల్లో నెలకొన్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి, సంక్షేమం గురించి చెప్పుకోవాల్సిన చోట డబ్బు, మద్యంపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రచారం ముగిసిన తర్వాత ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు జరగకుండా ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మద్యం అక్రమ నిల్వలు, నగదు పంపిణీపై నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా పోలింగ్‌కు ముందు రాత్రి జరిగే వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
ఫ మున్సిపల్ ఎన్నికల్లో
‘కూటమి’ ఎత్తుగడలు
ఫ ప్రభుత్వ వ్యతిరేకతను
కప్పిపుచ్చుకునేందుకు వ్యూహాలు
ఫ మద్యం, డబ్బు పంపిణీకి
తెరవెనుక రాజకీయాలు


