కడియం: పంటల బీమా చెల్లించకుండా రైతులను చంద్రబాబు ప్రభుత్వం నట్టేట్లో ముంచిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. శుక్రవారం కడియం ఆవలో ముంపునకు గురైన వరి పొలాలను డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, పార్టీ నాయకులతో కలసి ఆయన పరిశీలించారు. స్థానిక రైతులతో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ 1.25 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పెట్టుబడి పోయిందని, అప్పుల పాలయ్యామని, నాలుగైదు సీజన్లు వ్యవసాయం చేసినా కోలుకుంటామన్న నమ్మకం లేదని రైతులు చెబుతున్నారని వేణు అన్నారు. పంట చేతికొచ్చే ముందే చేలు నేలమట్టం అయ్యాయని, పొలాల నుంచి ముంపు నీరు బయటకు పోవడం లేదన్నారు. విజనరీ అని చెప్పుకొనే చంద్రబాబు కేవలం రైతులను కష్టపెట్టాలనే పంటల బీమాను చెల్లించలేదని వేణు అన్నారు. ఈ సీజన్‌లో తుపాన్లు వస్తాయని, తద్వారా రైతులు నష్టపోతారని తెలిసినా పట్టించుకోలేదంటే రైతులను ఎంత నిర్లక్ష్యంగా వదిలేశారో అర్థమవుతోందన్నారు. కానీ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా సిబ్బందిని నేరుగా రైతుల వద్దకే పంపించి, పంటల బీమా చెల్లించేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారని, దీనికి రూ.2,800 కోట్లను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అప్పట్లో చెల్లించిందని వేణు గుర్తు చేశారు. ఆ పథకాన్ని చంద్రబాబు నిలిపివేయడంతో రైతులు నష్టపోతున్నారని అన్నారు. పంట నష్టాన్ని లెక్కలు వేస్తానంటూ చంద్రబాబు హెలీకాఫ్టర్లలో తిరుగుతూ స్టేట్‌మెంట్లు ఇవ్వడానికే పరిమితం అయ్యారన్నారు. ప్రభుత్వం తక్షణం రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మోంథా తుపాను రాయితీ, బీమా ఇప్పటివరకు ఇవ్వలేదని కడియం ఆవ రైతులు చెబుతున్నారన్నారు. ఇక ఇప్పుడు జరిగిన నష్టానికి ఆదుకుంటారో లేదో కూడా అర్థం కావడం లేదన్నారు. ఇప్పుడు బియ్యం బస్తా రూ.2,600 దాటి పోయిందని, దీనికి వరి పండించవద్దని చెప్పిన చంద్రబాబు ఏం సమాధానం చెబుతున్నారని వేణు ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల వీర్రాజు, మండల పార్టీ అధ్యక్షులు యాదల సతీష్‌చంద్ర స్టాలిన్, కొత్తపల్లి శివాజీ, తాడాల విష్ణుచక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
ఫ తుపాను బాధితులను
తక్షణం ఆదుకోవాలి
ఫ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
చెల్లుబోయిన వేణు డిమాండ్


