పురపోరు..తుపాను హోరు | - | Sakshi
Sakshi News home page

పురపోరు..తుపాను హోరు

Oct 28 2026 12:18 AM | Updated on Oct 28 2026 12:18 AM

ఫ జిల్లా వైపు దూసుకొస్తున్న అర్నాబ్‌

ఫ రెండు మూడ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం

ఫ నవంబరు 1న మండపేట, కొవ్వూరు,

నిడదవోలులో పోలింగ్‌

ఫ ఎన్నికల ఏర్పాట్లు, తుపాను ముప్పుతో అధికారులపై ఒత్తిడి

సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లాలోని మండపేట, కొవ్వూరు, నిడదవోలు మున్సిపాలిటీలతో పాటు వాటి పరిధిలోని 92 వార్డులకు నవంబర్‌ 1న ఎన్నికలు జరగనుండటంతో అధికార యంత్రాంగం ఆ ఏర్పాట్లలో నిమగ్నమైంది. మరో వైపు పరిషత్‌ పోరు కు సంబంధించిన ఏర్పాట్లూ చేస్తున్నారు. మున్సిపాలిటీలు, పల్లెల్లో అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారంతో పాటు తెర వెనుక వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇంతలో తుపాను హెచ్చరికలు రావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాలను సిద్ధం చేయడంపై దృష్టి సారించింది.

పంట చేతికందే వేళ

ఎండలు, వర్షాభావ పరిస్థితులను తట్టుకుని వరి పంటను కాపాడుకున్న అన్నదాతలకు ఇప్పుడు తుపాను రూపంలో మరో ముప్పు ఎదురవుతోంది. జిల్లాలో సుమారు 92 వేల హెక్టార్లలో వరి పంట సాగు చేశారు. ఇందులో ఇప్పటికే 5 వేల హెక్టార్ల పంట కోతలు పూర్తయ్యాయి. మిగిలిన పంట చేతికందొచ్చింది. మరో 15 రోజులు వాతావరణం అనుకూలిస్తే పంట మొత్తం ఇళ్లకు చేరే అవకాశం ఉంది. ఇలాంటి దశలో భారీ వర్షాలు, ఈదురు గాలులు సంభవిస్తే వరి నేలకొరిగి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

పంట తడిస్తే సమస్యే..

కోతకు సిద్ధంగా ఉన్న పంట తడిసిపోతే ధాన్యం నాణ్యత దెబ్బతినడంతో పాటు ఆరబెట్టడం, విక్రయించడం కూడా సమస్యగా మారవచ్చని వాపోతున్నారు. ఇప్పటికే సాగు ఖర్చుల కోసం అప్పులు చేసిన రైతులకు పంట నష్టం జరిగితే ఆర్థికంగా కోలుకోవడం కష్టమవుతుందనే భయం వెంటాడుతోంది. పెట్టుబడులు తిరిగి వస్తాయనే ఆశతో ఎదురుచూస్తున్న తరుణంలో తుపాను హెచ్చరికలు వారిని కలవరపెడుతున్నాయి. పంటను కాపాడుకునేందుకు ఏం చేయాలో తెలియని అయోమయంలో అన్నదాతలు ఉన్నారు.

అధికారులకు సవాలే..

ఒక వైపు మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ, మరో వైపు తుపాను సహాయక చర్యలతో జిల్లా అధికారులకు పని ఒత్తిడి పెరిగింది. ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్‌ సిబ్బంది సమీకరణ, ఇతర విధులను పర్యవేక్షిస్తూనే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల భద్రతకు చర్యలు చేపట్టాల్సి వస్తోంది. తుపాను ప్రభావం ఎన్నికల ఏర్పాట్లపై పడకుండా చూడటంతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తులకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వాతావరణం అనుకూలించకపోతే రవాణా, విద్యుత్‌ సరఫరా, ఇతర మౌలిక సదుపాయాలకు అంతరాయం కలిగే అవకాశాలపైనా అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. జిల్లాలో ఇప్పుడు మూడు ప్రధాన సవాళ్లు ఎదురవుతున్నాయి. పట్టణాల్లో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడం, తుపాను ముప్పు నుంచి ప్రజలను కాపాడటం, చేతి కందే దశలో ఉన్న వరి పంటకు నష్టం జరగకుండా రైతులను అప్రమత్తం చేయడం యంత్రాంగానికి కీలకంగా మారాయి. ఎన్నికల రాజకీయాలు వేడెక్కుతున్న వేళ ప్రకృతి హెచ్చరికలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఒకవైపు ఓట్ల లెక్కలు, మరో వైపు తుపాను కదలికలు, ఇంకోవైపు పంటపై బెంగతో జిల్లా ప్రజలు ఆందోళనలో ఉన్నారు.

తుపాను హెచ్చరికలు

అర్నాబ్‌ తుపాను ముప్పు నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం రాత్రి తీరం దాటే అవకాశం ఉందని, బుధ, గురువారాల్లో తీవ్ర ప్రభావం చూపవచ్చని, గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని వెలువడిన హెచ్చరికలతో ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు పునరావాస కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురు గాలులు ఎదురైతే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటం అధికారులకు సవాల్‌గా మారింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

ఓ వైపు పుర పోరు, మరో వైపు తుపాను హోరుతో జిల్లాలో హడావుడి నెలకొంది. మున్సిపాలిటీలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంతో వాతావరణం వేడెక్కుతున్న వేళ అర్నాబ్‌ తుపాను ముప్పు కలవరపెడుతోంది. కష్టపడి పండించిన వరి పంట చేతికందే సమయంలో తుపాను రావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల విధులు, విపత్తు నిర్వహణ బాధ్యతలు ఒకేసారి మీద పడటంతో అధికారులకు కత్తిమీద సాములా మారింది.

ఎన్నికల సందడి

మండపేట, కొవ్వూరు, నిడదవోలు మున్సిపాలిటీల్లో ఎన్నికల వేడి రాజుకుంది. బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారానికి ఇంకా మూడు రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలవడం, స్థానిక సమస్యలపై హామీలు, ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలతో పట్టణాల్లో రాజకీయ సందడి నెలకొంది. ప్రత్యర్థుల బలాబలాలను అంచనా వేస్తూ గెలుపు కోసం తెర వెనుక మంత్రాంగం సాగిస్తున్నారు. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఓటర్లను సమీకరించడం, స్థానిక నాయకులను కలుపుకోని పోవడం, అసంతృప్తులను బుజ్జగించడం వంటి అంశాలపై అభ్యర్థులు దృష్టి సారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement