లో
మంగళవారం శ్రీ 27 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమి పార్టీల్లో సీట్ల సర్దుబాటు కొలిక్కిరాలేదు. ఎవరికి వారే తమ ఆధిపత్యం చూపిస్తూ అనుచరులతో నామినేషన్లు వేయించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వారందరూ బరిలో నిలవడంతో ఎవరికి సీటు కేటాయిస్తారో స్పష్టత కరువైంది. ఆయా స్థానాల్లో ఎవరిది డామినేషనో తెలియడం లేదు.
సాక్షి, రాజమహేంద్రవరం: పరిషత్ ఎన్నికల వేళ కూటమిలో కీచులాట మొదలైంది. అధికారం అండగా ఉన్నా, పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు మాత్రం కొలిక్కి రావడం లేదు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఎవరికి వారు తమ అభ్యర్థులను బరిలోకి దింపడంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. మరోవైపు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పీఠాన్ని ఏ పార్టీకి కేటాయించాలనే అంశంపై చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదు. ఎన్నికలయ్యాకే నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఎన్నికలకు ముందే సీట్ల పంచాయితీ, గెలుపుపై గుబులు కూటమి పార్టీలను వెంటాడుతోంది.
సమన్వయం కరువు
జిల్లాలోని సీతానగరం, చాగల్లు, దేవరపల్లి, కడియం, కొవ్వూరు, నల్లజర్ల, నిడదవోలు, రాజానగరం, తాళ్లపూడి స్థానాల్లో కూటమి అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ స్థానాలు ఏ పార్టీకి కేటాయిస్తారో సోమవారం రాత్రికి కూడా స్పష్టత లేకపోవడంతో ఎవరూ నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. మరోవైపు మంగళవారమే నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో గందరగోళం నెలకొంది. ఎవరెవరు పోటీలో ఉంటారో తేలడం లేదు. మొత్తంగా చంద్రబాబు నిర్ణయం కారణంగా కూటమి పార్టీల మధ్య సమన్వయం కొరవడి వారిలో వారే పోటీపడే పరిస్థితి నెలకొంది.
పోటాపోటీగా..
పరిషత్ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సమన్వయం కొరవడింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను స్థానికంగా చర్చించుకుని సర్దుబాటు చేసుకోవాలని చంద్రబాబు తప్పించుకున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సీట్లపై స్పష్టత రాకముందే టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకునే ప్రయత్నాలు చేశారు. పలుచోట్ల ఆయా పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు ఎవరిని కొనసాగించాలి, ఎవరితో నామినేషన్ ఉపసంహరింపజేయాలి అన్నది నాయకత్వానికి సవాల్‌గా మారింది. టికెట్ ఖాయమని నమ్మి నామినేషన్‌న్ వేసిన అభ్యర్థులు వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. దీంతో స్థానిక నాయకులపై ఒత్తిడి పెరుగుతోంది.
ఖర్చు ఎవరిది?
సీట్ల సర్దుబాటుతో పాటు ఎన్నికల ఖర్చుల అంశంపైనా స్పష్టత కొరవడినట్లు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీ అభ్యర్థికి ఏ స్థానం కేటాయిస్తారు? పోటీ నుంచి తప్పుకునే వారికి ఎలాంటి హామీ ఇస్తారు? ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఖర్చును ఎవరు భరిస్తారు? అనే అంశాలపై స్పష్టమైన నిర్ణయం లేకపోవడంతో అభ్యర్థులు అయోమయంలో ఉన్నారు. ఒకవైపు నామినేషన్లు వేసి ప్రచారానికి సిద్ధమవుతుంటే.. మరోవైపు పార్టీ పెద్దల నుంచి తుది సంకేతాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఇప్పటికే బరిలోకి దిగిన అభ్యర్థులను సమన్వయం చేయడం, అసంతృప్తులను బుజ్జగించడం స్థానిక నాయకత్వానికి కత్తిమీద సాములా మారింది. ఎన్నికల్లో ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సిన కూటమి నాయకులు ముందుగా తమలో తామే తలపడే పరిస్థితి ఏర్పడింది. ఒకే స్థానంలో కూటమి పార్టీల అభ్యర్థులు బరిలో ఉంటే ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉందని నాయకులు ఆందోళన చెందుతున్నారు. స్థానికంగా సర్దుబాట్లు చేయాలన్న ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికలకు ముందే ఏకాభిప్రాయం సాధించలేకపోతే, ఆ ప్రభావం ఫలితాలపై పడుతుందనే ఆందోళన కూటమి శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
8
ఫ కూటమిలో ఆధిపత్య పోరు?
ఫ పోటాపోటీగా నామినేషన్లు
ఫ మొదలైన కీచులాట
ఫ జెడ్పీ చైర్ పర్సన్
అభ్యర్థిపై స్పష్టత శూన్యం
ఫ టీడీపీ, జనసేన,
బీజేపీ అభ్యర్థుల అయోమయం
ఆశావహుల్లో అసంతృప్తి
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్థానం కూటమిలో మరో వివాదానికి కేంద్రంగా మారింది. ఈ పీఠాన్ని తమకే కేటాయించేలా టీడీపీ, జనసేన నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. తమ పార్టీకి ప్రాధాన్యం ఇవ్వాలంటూ ఇరు పార్టీల నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే ఆ అభ్యర్థిని ఎన్నికల తర్వాత నిర్ణయిస్తామని చంద్రబాబు చెప్పడంతో ఎవరి ఆశలు నెరవేరతాయనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. ముందుగా అభ్యర్థిని ఖరారు చేసి, పార్టీ శ్రేణులను సమన్వయం చేయాల్సిన సమయంలో నిర్ణయాన్ని చంద్రబాబు వాయిదా వేయడంపై ఆశావహుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
తమదేనంటూ ప్రచారం!
ఫ పొత్తులో భాగంగా జెడ్పీ చైర్ పర్సన్ స్థానం తమ కంటే తమకేనని టీడీపీ, జనసేన నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. జనసేన నుంచి బత్తుల బలరామకృష్ణ భార్య సీతానగరం నుంచి జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేశారు. అదే స్థానం నుంచి జనసేనలో ప్రారంభం నుంచీ క్రియాశీలకంగా పనిచేస్తున్న గంటా స్వరూపరాణి కూడా నామినేషన్‌న్ దాఖలు చేసినా అధికారులు తిరస్కరించారు. మరోవైపు ఇదే స్థానానికి టీడీపీ అభ్యర్థి కూడా నామినేషన్ వేయడంతో కూటమి కేడర్‌లో మరింత గందరగోళం నెలకొంది. ఈ స్థానం నుంచి గెలిచి జెడ్పీ చైర్‌పర్సన్ స్థానం సొంతం చేసుకుంటాననే ఊహల్లో బత్తుల కుటుంబ సభ్యులున్నారు. అయితే ఇప్పటికే ఎమ్మెల్యేగా విఫలమయ్యారనే విమర్శలున్న వేళ జెడ్పీ చైర్‌పర్సన్ స్థానానికి పరిశీలనలోకే బత్తుల వెంకటలక్ష్మి పేరు పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. మరోవైపు మంత్రి కందుల దుర్గేశ్ కూడా బత్తులకు చెక్ పెట్టేందుకు తెరవెనుక ప్రయత్నిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఫ కొవ్వూరు ఏఎంసీ చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్ భార్య అశ్విని కొవ్వూరు జెడ్పీటీసీ స్థానానికి చాగల్లు నుంచి వచ్చి నామినేషన్ వేశారు. వీరు కూడా జెడ్పీ చైర్‌పర్సన్ కోసం రేసులో ఉన్నామని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఇదే స్థానం నుంచి జనసేన తరఫున ఉప్పులూరి లావణ్య, ఉప్పులూరి రాజేంద్ర, బీజేపీ తరఫున పెరుగు పోతురాజు నామినేషన్లు వేశారు. మాకంటే మాకు ఈ సీటు కేటాయించాలని పట్టుబడుతున్న వేళ చివరకు పోటీలో ఎవరుంటారో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది.
ఫ మరోవైపు రంగంపేట నుంచి టీడీపీ సీనియర్ నాయకుడు ఆళ్ల గోవింద భార్య ఆళ్ల శిరీష నామినేషన్ వేశారు. ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన వీరు కూడా జెడ్పీ చైర్‌పర్సన్ స్థానం కోసం పోటీపడుతున్నారు.
ఫ గౌరీపట్నానికి చెందిన అండ్రు అనిల్ భార్య రాధిక దేవరపల్లి జెడ్పీటీసీకి నామినేషన్ వేశారు. ఆమె కూడా చైర్ పర్సన్ స్థానాన్ని ఆశిస్తున్నారు. మొత్తానికి ఎవరు పోటీలో ఉంటారో తేలకముందే చైర్ పర్సన్ స్థానం తమకంటే తమకేనని ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు ప్రకటనతో కూటమి శ్రేణుల్లో మరింత గందరగోళం నెలకొంది.


