సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): తుపాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. తుపాను పరిస్థితుల నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ వై.మేఘ స్వరూప్, సహాయ కలెక్టర్ కె.ఆదిత్య శర్మ హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలగకుండా నిబంధనలు పాటిస్తూ ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లను అప్రమత్తంగా ఉంచాలని, వర్షాలు, వరదల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న గ్రామాలు, వాగులు, వంకలు, నదీ పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, పునరావాస కేంద్రాలను సిద్ధం చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యుత్, తాగునీరు, వైద్య సేవలు, రహదారులకు అంతరాయం కలగకుండా సంబంధిత శాఖలు చర్యలు చేపట్టాలని, అత్యవసర సేవలను అందించేందుకు సిబ్బంది, అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో జిల్లాలో స్థానిక సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఫ భారీ నుంచి అతి భారీ వర్షాలు
కురిసే అవకాశం
ఫ లోతట్టు ప్రాంతాలపై
ప్రత్యేక దృష్టి సారించాలి
ఫ అధికారులతో కలెక్టర్ కీర్తి


