కంబాలచెరువు(రాజమహేంద్రవరం): అర్నాబ్ తుపాను నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళ, బుధవారాల్లో జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించినట్టు డీఈవో కె.వాసుదేవరావు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లోని ముఖ్యమైన రికార్డులు, సామగ్రి పాడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తుపాను పునరావాస కేంద్రాలుగా (షెల్టర్లు) ఎంపిక చేసిన పాఠశాలల్లోని స్మార్ట్ టీవీలు, ఐఎఫ్‌పీ ప్యానెళ్లకు పక్కాగా రక్షణ ఏర్పాట్లు చేయాలన్నారు. ఆ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెంటనే సంబంధిత రెవెన్యూ, సహాయక సిబ్బందికి పాఠశాల తాళాలను అప్పగించాలన్నారు. తుపాను ప్రభావం తగ్గేంతవరకు విద్యార్థులు ఇళ్ల వద్దే సురక్షితంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు (ఎంఈవోలు) ఎప్పటికప్పుడు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి ఫోన్ ద్వారా అందుబాటులో ఉండాలన్నారు.
ఎన్నికల ఖర్చులో
మార్గదర్శకాలు పాటించాలి
సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): ఎన్నికల ఖర్చు నియంత్రణ, లెక్కల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థి తన ఎన్నికల ఏజెంట్ ద్వారా చేసిన ఖర్చుతో పాటు, అతడి ఎన్నికను ప్రోత్సహించేందుకు ఇతర వ్యక్తులు, సంఘాలు, సంబంధిత రాజకీయ పార్టీ చేసిన ఖర్చును కూడా నిబంధనల ప్రకారం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థి పేరు, ఫొటో లేకుండా పార్టీ నాయకుడి ఫొటో, విజ్ఞప్తితో ముద్రణ, ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో ఇచ్చే సాధారణ ప్రచార ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లు, జెండాలు, స్టిక్కర్లకు అయ్యే ఖర్చులను రాజకీయ పార్టీ ఖాతాలో నమోదు చేయాలన్నారు. ప్రచార ప్రకటనలు, సామగ్రిలో నిర్దిష్ట అభ్యర్థి పేరు, ఫొటో ఉంటే సంబంధిత ఖర్చును ఆ అభ్యర్థి ఎన్నికల ఖర్చుల ఖాతాలో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు.
ఎన్నికల కోడ్‌ను
ఉల్లంఘించి డ్రైనేజీ నిర్మాణం
సీతానగరం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌ను యథేచ్ఛగా ఉల్లంఘించారు. ముగ్గళ్ల గ్రామంలోని ఎస్సీ పేటలో నిబంధనలకు విరుద్ధంగా సోమవారం డ్రైనేజీ పనులను చేపట్టారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వస్తున్న కూటమి నాయకులకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. వారిని శాంతింపజేసేందుకే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ఇక్కడ డ్రైనేజీ పనులు చేపట్టారని తెలుస్తోంది. ఎన్నికల నిబంధనలను సంబంధిత అధికారులు, అధికార పార్టీ నాయకులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నేడు, రేపు పలు రైళ్ల రద్దు
రాజమహేంద్రవరం సిటీ: అర్నాబ్ తుపాన్ కారణంగా జిల్లా మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను మంగళ, బుధవారాల్లో రద్దు చేశారు. అలాగే ప్రయాణికులు సౌకర్యార్థం రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ సుంకర చంద్రమౌళి మాట్లాడుతూ ప్రయాణికులు రైళ్ల రద్దు వివరాలను 81259 68801 నంబరు ద్వారా తెలుసుకోవచ్చన్నారు. రాజమహేంద్రవరం– విజయవాడ (67261), నర్సాపూర్ – రాజమహేంద్రవరం (67246), విజయవాడ – కాకినాడ (17257), కాకినాడ – రాజమహేంద్రవరం (67302), విజయవాడ – రాజమహేంద్రవరం(67202), విజయవాడ – రాజమహేంద్రవరం (67262), రాజమహేంద్రవరం – కాకినాడ(67301), కాకినాడ – విశాఖపట్నం (17267), కాకినాడ – విజయవాడ(17258), రాజమహేంద్రవరం – విశాఖపట్నం (67285), విశాఖపట్నం – రాజమహేంద్రవరం (67486) రైళ్లను రద్దు చేశామన్నారు.


