సాక్షి, రాజమహేంద్రవరం: సొంతిల్లు అనేది పేదల స్వప్నం. వాటి సాకారానికి భూములు సేకరించి, లే అవుట్లుగా అభివృద్ధి చేసి, పట్టాలు పంపిణీ చేసిన మనసున్న మారాజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన హయాంలోనే ఆయా కాలనీల్లో విద్యుత్, తాగునీటి వసతులు కల్పించారు. కొందరు లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకుని నిలసిస్తుండగా, మరి కొందరి నిర్మాణాలు సగం వరకు పూర్తయ్యాయి. 2024 ఎన్నికల్లో సైతం ఆయనే ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఈ పాటికి ఆ లేఅవుట్లన్నీ ఎంతో సుందరంగా దర్శనమిచ్చేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వం రావడంతో జగన్‌పై అక్కసును ఆయన పేరున ఉన్న కాలనీలపై చూపుతూ అభివృద్ధికి ఆమడదూరంలో ఉంచేశారు. ఈ నేపథ్యంలో పలు కాలనీల్లో తాగునీరు, లోవోల్టేజీ సమస్యలతో కాలనీల వాసులు ఇబ్బంది పడుతున్నారు. నిర్మాణాలు ప్రారంభించిన కొన్ని ఇళ్లకు బిల్లులు అందక పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. జిల్లాలోని వెలుగుబంద, తొర్రేడులోని కాలనీలను పరిశీలిస్తే జగన్‌పై చంద్రబాబు ఎంత కక్ష పెంచుకున్నారన్నది స్పష్టంగా తెలుస్తుంది.
14 వేల మందికి పట్టాలు.. సౌకర్యాలు శూన్యం
రాజానగరం నియోజకవర్గంలోని వెలుగుబంద, తొర్రేడులో లే అవుట్లను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం భారీ ప్రాజెక్టులుగా అభివృద్ధి చేసింది. వెలుగుబందలో సుమారు 14 వేల మందికి, తొర్రేడులో 2,600 మందికి పట్టాలు పంపిణీ చేసి మౌలిక వసతులైన విద్యుత్, తాగునీటి సరఫరాలను కల్పించింది. కొందరు ఇప్పటికే వారి సొంత ఇళ్లలో నివసిస్తుండగా మరికొందరు సగంలో ఆగిపోయిన నిర్మాణాలు పూర్తి చేసుకోవడానికి ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
రాకపోకలకు నరకయాతన
కాలనీల్లో ప్రధాన, అంతర్గత రహదారుల నిర్మాణం పూర్తిస్థాయిలో జరగకపోవడంతో స్థానికుల రాకపోకలు కష్టంగా మారాయి. ఇళ్ల నిర్మాణాలు పెరుగుతున్న కొద్దీ రహదారుల ఆవశ్యకత మరింత పెరుగుతోంది. అయినప్పటికీ రహదారుల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం శోచనీయం.
దాహం తీర్చని నీటి ట్యాంకులు
కాలనీవాసుల తాగునీటి అవసరాలకు గత ప్రభుత్వ హయాంలోనే ట్యాంకులు, పైప్‌లైన్లను నిర్మించారు. అయితే వెలుగుబంద జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ సామగ్రి తీసుకువచ్చే వాహనాల రాకపోకలతో పలుచోట్ల పైప్‌లైన్లు ధ్వంసమయ్యాయి. కొన్ని ట్యాంకుల మోటార్లు పనిచేయడం లేదు. వాటి మరమ్మతులకు అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదు. రెండు మూడు రోజులకు ఒకసారి నీటి ట్యాంకులను పంపుతూ సరిపెట్టేస్తున్నారు. ఆ ట్యాంకర్ల రాకపోకలకు సమయపాలన లేకపోవడంతో కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. ట్యాంకర్లు వచ్చినపుడు ఉన్నవారికే నీళ్లు లేకుంటే లేదన్నట్టుంది పరిస్థితి. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి గతంలో నిర్మించిన ట్యాంకులు, పైప్‌లైన్లు సక్రమంగా నిర్వహించి, అససరమైన మరమ్మతులు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.
లో వోల్టేజీతో తిప్పలు
వెలుగుబంద లే అవుట్‌లో విద్యుత్ సమస్యతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో ఇళ్లకు తగ్గట్టుగా సర్వీసులు అంచనా వేసి గత ప్రభుత్వ హయాంలోనే ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్లు ఏర్పాటుచేశారు. కాగా కాలనీలో ఇళ్ల నిర్మాణాలు పూర్తిస్థాయిలో జరగకపోవడం, విద్యుత్ వినియోగం తక్కువగా ఉండడంతో కొన్ని ట్రాన్స్‌ఫార్మర్లను అధికారులు తరలించారని స్థానికులు చెప్తున్నారు. దీంతో లోవోల్టేజీ సమస్యతో ఇళ్లలోని విద్యుత్ ఉపకరణాలు సరిగా పనిచేయడం లేదని, పలు సందర్భాలలో పాడైపోతున్నాయని వారు అంటున్నారు. ఇళ్ల నిర్మాణాలు పెరిగే కొద్దీ ట్రాన్స్‌ఫార్మర్ల ఆవశ్యకత పెరుగుతుందని ఇంతలోనే వాటిని తొలగించడాన్ని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు సత్వరం ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
బిల్లులు రాక.. నిలిచిన ఇళ్ల నిర్మాణాలు
సొంతింటి కల సాకారం చేసుకునే దిశగా వారికి పంపిణీ చేసిన పట్టాల మేరకు ఆయా స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన కొందరు ఇప్పటికే నిర్మాణాలు పూర్తిచేసుకుని నివసిస్తున్నారు. మరికొందరు పుస్తీ పుట్రా తాకట్టు పెట్టి నిర్మాణాలు ప్రారంభించగా ఆ నిర్మాణాలన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మారిన తర్వాత బిల్లులు సకాలంలో అందకపోవడంతో అనేక నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం అందకపోవడం.. సొంతంగా నిర్మించుకునే స్థోమత లేకపోవడం ఆ పేద కుటుంబాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. అప్పులు చేసి నిర్మాణాలు ప్రారంభించిన వారు వాటిని తీర్చలేక ఇబ్బంది పడుతూ అద్దె ఇళ్లలోనే మగ్గిపోతున్నారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులను పరిశీలించి, అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో చెల్లింపులు చేయాలని బాధితులు కోరుతున్నారు.
రాజమహేంద్రవరం రూరల్ తొర్రేడులో
జగనన్న కాలనీలో అధ్వానంగాన రోడ్లు
గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్స్‌ను కూటమి ప్రభుత్వం తొలగించిన దృశ్యం
జగనన్న కాలనీల
అభివృద్ధిపై ప్రభుత్వం నిర్లక్ష్యం
తాగునీరు, విద్యుత్,
రహదారులు అధ్వానం
గత ప్రభుత్వంలోనే అన్నీ
సమకూర్చినా అన్నింటినీ అస్తవ్యస్తం
చేసిన చంద్రబాబు సర్కారు
వెలుగుబంద,
తొర్రేడు కాలనీల్లో సమస్యల తిష్ట


