పెరవలి: కొవ్వూరు మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా వైఎస్సార్ సీపీ నుంచి గంట్రోతు అంజలీదేవి పేరును చేశారు. ఈ విషయాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. కొవ్వూరు పార్టీ కార్యాలయంలో మంగళవారం రాత్రి ఆమెకు ఈ మేరకు బీఫారం అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో గెలవడానికి కూటమి ప్రభుత్వం ఎంతకై నా తెగిస్తుందని అందరు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజా క్షేత్రంలో గెలవడానికి గతంలో పార్టీ అందించిన సంక్షేమం, అభివృద్ధి, ఈ రెండున్నర ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఏం చేయలేదో వివరించాలన్నారు. కూటమి అఽధికారం చేపట్టిన తరువాత ఒక్క సంక్షేమ కార్యక్రమం చేయలేదని, దోపిడీకి అన్ని వనరులు సమకూర్చిందన్నారు. తలారి వెంకట్రావు మాట్లాడుతూ ధర్మానికి అధర్మానికీ జరిగే ఎన్నికలు ఇవి అని, ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. టీడీపీ ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించాలన్నారు. కొవ్వూరు పట్టణంలో వైఎస్సార్ సీపీ పాలనలో 60 ఎకరాలు ఇళ్ల స్థలాలుగా ఇచ్చామని, విద్యార్థుల కోసం డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశామని తెలిపారు. మా ప్రభుత్వంలో రైతు భరోసా, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంటు, ఆటోవాలాలకు సొమ్ములు, మహిళల రుణమాపీ, వైఎస్సార్ ఆసరా, పేదలకు ఇళ్ల పట్టాలు వంటి సంక్షేమ కార్యక్రమాలు జరుగాయని తెలిపారు. ఓటర్లు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గుర్తించి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర యువజన అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పట్టణ అధ్యక్షుడు చిట్టూరి అన్నవరం, వైఎస్సార్ సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బి ఫారం అందజేసిన వైఎస్సార్ సీపీ
జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన


