లోకో పైలెట్‌ సురేష్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం | - | Sakshi
Sakshi News home page

లోకో పైలెట్‌ సురేష్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం

Oct 22 2026 12:51 AM | Updated on Oct 22 2026 12:51 AM

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించి రానున్న ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి సురక్షిత రైళ్ల నిర్వహణకు కృషి చేసిన విజయవాడ డివిజన్‌ రాజమహేంద్రవరం గూడ్స్‌ లోకో పైలెట్‌ టి.సురేష్‌ ప్రతిష్టాత్మక ‘జీఎం మ్యాన్‌ ఆఫ్‌ ది మంత్‌ సేఫ్టీ అవార్డు’ అందుకున్నారు. విశాఖపట్నంలోని జోనల్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో బుధవారం అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్‌ మాధుర్‌ నుంచి సురేష్‌ ఈ అవార్డు స్వీకరించారు. సెప్టెంబర్‌ 28న ఆయన విధుల్లో ఉండగా పక్క ట్రాక్‌పై వెళ్తున్న ఒక గూడ్స్‌ రైలులోని వ్యాగన్‌ యాక్సిల్‌ బాక్స్‌ నుంచి భారీగా మంటలు రావటాన్ని గుర్తించి వెంటనే స్పందించి వాకీటాకీ ద్వారా పక్క రైలులోని లోకో పైలెట్లు, ట్రైన్‌ మేనేజర్లను అప్రమత్తం చేశారు. వారు తక్షణం రైలును నిలిపి మంటలను అదుపు చేశారు. అనంతరం గుణదల రైల్వేస్టేషన్‌లో చక్రం మార్చేందుకు వ్యాగన్‌ను వేరు చేశారు. సురేష్‌ చూసిన అప్రమత్తతకు జీఎం సేఫ్టీ అవార్డును అందజేసి అభినందించారు.

నామినేషన్ల

ఉపసంహరణలో వివాదం

నిడదవోలు: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో బుధవారం టీడీపీ నాయకుల మధ్య వివాదం చోటుచేసుకుంది. స్థానిక 8 వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థిగా మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ పేరూరి సాయిబాబా టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. అదే వార్డులో జనసేన నుంచి గంగుల వెంకటలక్ష్మి నామినేషన్‌ వేశారు. అయితే సాయిబాబాపై టీడీపీ నేతలు ఒత్తిడి తీసుకువచ్చి నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని పట్టుపట్టారు. దీంతో ఆయన తన నామినేషన్‌ ఉపసంహరించుకోవడానికి వస్తున్న సమయంలో టీడీపీ లీగల్‌ అడ్వయిజర్‌ ఆకుతోట సతీష్‌ కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. హ.. వచ్చావా అంటూ సతీష్‌ వెటకారంగా మాట్లాడడంతో సాయిబాబా ఆగ్రహంతో సతీష్‌పై దాడి చేశాడు. దీంతో అక్కడున్న వారంతా వారించి గొడవ లేకుండా చేశారు. తర్వాత అక్కడే ఓ పక్క మాటువేసి ఉన్న సతీష్‌ తిరిగి సాయిబాబాపై దాడి చేయడంతో ఇరువురి మధ్య కొట్లాట జరిగింది. అక్కడే ఉన్న టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షుడు రంగా రమేష్‌ జోక్యం చేసుకుని ఇరువురిని వారించారు. పోలీసులు రంగప్రవేశంతో గొడవ సద్దుమణిగింది.

పంచారామాలు,

శబరిమలకు ప్రత్యేక బస్సులు

రాజమహేంద్రవరం సిటీ: కార్తిక మాసాన్ని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్‌ ఆర్టీసీ పంచారామాలు, శబరిమలై యాత్రలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎంయూవీ మనోహర్‌ తెలిపారు. బుధవారం ఆయన కార్యాలయంలో అధికారులతో కలసి వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. పంచారామాలను ఒకే రోజు సందర్శించేందుకు ఎక్స్‌ప్రెస్‌ బస్సు, అల్ట్రా డీలక్స్‌ బస్సు, సూపర్‌ లగ్జరీ బస్సులను ప్రత్యేక ప్యాకేజీలతో అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తెలిపారు. శబరిమలై అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తుల కోసం సూపర్‌ లగ్జరీ బస్సుల ద్వారా 5 రోజులు, 7 రోజులు, 10 రోజుల యాత్ర ప్యాకేజీలను ఏర్పాటు చేశామన్నారు. ముందస్తు సమాచారం కోసం 95023 00189, 83176 02975, 0883 2468625, 99592 25561 ఫోన్‌ నంబర్లను సంప్రదించి యాత్రల వివరాలను తెలుసుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం డిపో మేనేజర్‌ మాధవ్‌, గోకవరం డిపో మేనేజర్‌ అజయ్‌ బాబు పాల్గొన్నారు.

మున్సిపల్‌ కార్యాలయంలో కొట్లాట వద్ద గుమిగూడిన కూటమి నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement