రెగ్యులర్ చేయాలి
శ్రమ దోపిడికి గురవుతున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి. గత ఎన్నికల్లో కూటమి పెద్దలు మాకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తూ, ప్రజలకు సేవలందిస్తున్న మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోంది.
– అజయ్, రాష్ట్ర పారా మెడికల్
జేఏసీ కన్వీనర్, కాకినాడ
డిమాండ్లు నెరవేర్చాలి
అంగన్‌వాడీ ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం సత్వరం నెరవేర్చాలి. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత అంగన్‌వాడీలకు ఒక్క పైసా కూడా పెంచకపోవడం దారుణం. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా వేతనాలు చెల్లించాలి.
– కృష్ణవేణి, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యురాలు, మండపేట, తూర్పు గోదావరి జిల్లా
శ్రమ దోపిడీకి గురవుతున్నాం
రెవెన్యూ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మేము శ్రమ దోపిడీకి గురవుతున్నాం. ప్రభుత్వం మాతో వెట్టిచాకిరీ చేయించుకుంటూ అరకొర వేతనాలు చెల్లిస్తోంది. బహిరంగ విపణిలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచాలి. ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలి.
– ప్రసన్న, వీఆర్‌ఏల జిల్లా మహిళా
సమాఖ్య సభ్యురాలు, ఆలమూరు
అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న వీఆర్‌ఏలు
తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ధర్నా చేస్తున్న అంగన్‌వాడీలు (ఫైల్)
వీఆర్‌ఏల డిమాండ్లు
తెలంగాణ తరహాలో వీఆర్‌ఏలందరికి పే స్కేల్ వర్తింపజేయాలి.
నామినీ వీఆర్‌ఏలను రెగ్యులర్ వీఆర్‌ఏలుగా గుర్తించాలి.
వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌గా గ్రేడ్–3 వీఆర్‌ఓలుగా ఉద్యోగోన్నతులివ్వాలి.
కనీస వేతన చట్టం అమలు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలి.
రెవెన్యూ శాఖలో 20 శాతంగా ఉన్న అటెండర్, నైట్ వాచ్‌మెన్, డ్రైవర్ పోస్టుల్లో ఉద్యోగోన్నతి కోటాను 70 శాతానికి పెంచాలి.
అంగన్‌వాడీల కోర్కెలివీ..
ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలి.
సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఉద్యోగ భద్రత కల్పించాలి.
వర్కర్లకు, హెల్పర్లకు కనీస వేతనాలు పెంచాలి.
యాప్‌లన్నీ మిళితం చేసి, వాటి భారం తగ్గించాలి.
అంగన్‌వాడీలకు ఇతర శాఖల బాధ్యతలు అప్పగించకూడదు.
ఉద్యోగ విరమణ సమయంలో ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచాలి.
కాంట్రాక్టు ఉద్యోగుల విన్నపాలివీ..
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే సౌకర్యాలు కల్పించాలి.
ఉచిత ప్రమాద బీమాను రూ.20 లక్షల వరకూ వర్తింపజేయాలి.
ఉద్యోగాలను క్రమబద్ధీకరించి, ఉద్యోగ భద్రత కల్పించాలి.
కొత్త పీఆర్‌సీ సిఫారసులను, ఐఆర్ ప్రయోజనాలను అందించాలి.
కాంట్రాక్ట్ కాలపరిమితి సాకుతో అకారణంగా ఉద్యోగులను తొలగించరాదు.
పిడికిళ్లు బిగించిన ప్రభుత్వోద్యోగులు
పోరుబాటలో వివిధ విభాగాల సిబ్బంది
నేడు గాంధీజీ విగ్రహాలకు అంగన్‌వాడీల వినతిపత్రాలు
రేపటి నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల నిరవధిక సమ్మె
17వ రోజుకు చేరిన వీఆర్‌ఏలు దీక్షలు
పట్టించుకోని ప్రభుత్వంపై
ఉద్యోగుల ఆగ్రహం
ఆలమూరు: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలనే డిమాండుతో వివిధ విభాగాల ఉద్యోగులు సర్కారుపై సమరశంఖం పూరిస్తున్నారు. దశలవారీగా ఆందోళనలు నిర్వహిస్తున్నా.. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర స్థాయిలో నిరసనలు తెలియజేస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు అంగన్‌వాడీ సిబ్బందిలు, గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) రాష్ట్ర ప్రభుత్వంపై పిడికిళ్లు బిగిస్తున్నారు. ఇప్పటికే గ్రామ సచివాలయ ఉద్యోగులు గత నెల 27న చేపట్టి, విజయవంతం చేసిన చలో విజయవాడ స్ఫూర్తితో ఇతర ఉద్యోగ సంఘాలు పోరుబాట పడుతున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యోగులందరూ ఏకతాటి పైకి వస్తున్నారు.
ఉద్యమ బాటలోనే ఉద్యోగులందరూ..
రెవెన్యూ శాఖకు ఆయువుపట్టు లాంటి వీఆర్‌ఏలు గత నెల 16 నుంచి ఉద్యమ బాట పట్టారు. జిల్లాలోని 2 వేల మందికి పైగా వీఆర్‌ఏలు వివిధ రూపాల్లో వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తున్నారు, వారి పోరాటం 17వ రోజుకు చేరినా ప్రభుత్వం స్పందించకపోవడంతో గురువారం చలో అమలాపురం కార్యక్రమానికి పిలుపునిచ్చి విజయవంతం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించేంత వరకూ తమ పోరాటం కొనసాగుతుందని వీఆర్‌ఏల సంఘం నాయకులు హెచ్చరించారు. వారి ఆందోళనతో క్షేత్ర స్థాయిలో రెవెన్యూ శాఖ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై జిల్లాలోని 1,768 అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న కార్యకర్తలు, ఆయాలు మండిపడుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పెంచిన వేతనాలు తప్ప ప్రస్తుత ప్రభుత్వం ఒక్క పైసా కూడా పెంచలేదని, పైగా యాప్‌ల భారం పెంచేసిందని దుయ్యబడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గాంధీ జయంతి రోజైన శుక్రవారం మహాత్మాగాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు అందించేందుకు వారు సమాయత్తమవుతున్నారు.
వైద్య, ఆరోగ్య శాఖలో జిల్లాలోని 47 పీహెచ్‌సీలు, 2 ఏరియా ఆస్పత్రులు, 9 సీహెచ్‌సీల్లో పని చేస్తున్న సుమారు 250 మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆగస్టు 30 నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబించడంతో ఈ నెల 3 నుంచి పూర్తి స్థాయిలో విధులను బహిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. అదే కనుక జరిగితే వారి సేవలు ప్రజలకు దూరమై, ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు అందడం గగనమే అవుతుంది. రక్త పరీక్షలు కూడా చేసే అవకాశం లేక, రోగులు ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించి, చేతిచమురు వదిలించుకోవలసిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది.


