హతమార్చి.. ఆభరణాలు అపహరించి.. | - | Sakshi
Sakshi News home page

హతమార్చి.. ఆభరణాలు అపహరించి..

Oct 2 2026 12:28 AM | Updated on Oct 2 2026 12:28 AM

● ఆటో వాయిదా చెల్లించేందుకు

డ్రైవర్‌ ఘాతుకం

● మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్టు

తాళ్లపూడి: ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్త పట్టిసీమ గ్రామానికి చెందిన వింటి ఆదిలక్ష్మి (36) హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కొవ్వూరు రూరల్‌ సీఐ విజయబాబు గురువారం ఈ వివరాలు తెలిపారు. ఆయన ప్రకారం.. తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామానికి చెందిన షేక్‌ యాకూబ్‌ ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. తన ఆటో ఫైనాన్స్‌ వాయిదా చెల్లించేందుకు ఆర్థికంగా అతడు ఇబ్బంది పడుతున్నాడు. కొత్త పట్టిసీమకు చెందిన ఆదిలక్ష్మి తాళ్లపూడిలోని ఓ స్వీట్‌ షాపులో పని చేస్తోంది. గత సోమవారం రాత్రి షాపులో పని ముగించుకుని 8 గంటలకు తాళ్లపూడి అయ్యర్‌ హోటల్‌ సమీపాన యాకూబ్‌ ఆటో ఎక్కింది. ఈ క్రమంలో అతడు ఆమెను తాడిపూడి శ్మశానవాటిక సమీపాన గోదావరి లంక ప్రాంతానికి తీసుకెళ్లి హతమార్చాడు. ఆదిలక్ష్మి వద్ద ఉన్న బంగారు గొలుసు, చెవి కమ్మలు తీసుకుని, ఆమె మృతదేహాన్ని గోదావరిలో పడేశాడు. ఆమె మొబైల్‌ ఫోన్‌ను కూడా గోదావరిలో పడేశాడు. ఆదిలక్ష్మిని గోదావరిలో తోసేశారనే సమాచారంతో తండ్రి నాగిరెడ్డి ఫిర్యాదు మేరకు తాళ్లపూడి పోలీసులు దర్యాప్తు చేపట్టి, హత్య కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడు యాకూబ్‌ బుధవారం సాయంత్రం తాడిపూడి గ్రామ పంచాయతీ కార్యదర్శి నవీన వద్దకు వెళ్లి, ఆదిలక్ష్మిని తానే హతమార్చినట్లు చెప్పాడు. అతడి వాంగ్మూలాన్ని పంచాయతీ కార్యదర్శి నమోదు చేసి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు యాకూబ్‌ను కొవ్వూరు రూరల్‌ సీఐ విజయబాబు గురువారం అరెస్టు చేశారు. ఆటో వాయిదా కట్టడానికి గాను ఆదిలక్ష్మి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను యాకూబ్‌ అపహరించి, ఆపై హత్య చేసి గోదావరిలో పడేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ నేరానికి యాకూబ్‌ ఉపయోగించిన ఆటోను, అతడు చూపించిన ప్రదేశం నుంచి బంగారు ఆభరణాలు, స్టీల్‌ లంచ్‌ బాక్స్‌, ఆధార్‌ కార్డు, చీర తదితర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించి, తదుపరి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఆదిలక్ష్మి మృతదేహం కోసం గోదావరి నదిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

నిందితుడిని కఠినంగా శిక్షించాలి

ఆదిలక్ష్మిని హతమార్చిన యాకూబ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ కొత్త పట్టిసీమ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తాళ్లపూడి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట గురువారం ఆందోళన చేపట్టారు. తమకు అన్యాయం జరుగుతోందని, హతురాలిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ చెడుగా చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌ స్టేషన్‌లో తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాకూబ్‌ను తమకు అప్పగించాలని, ఆదిలక్ష్మిని హతమార్చినట్టుగానే అతడిని కూడా చంపాలని డిమాండ్‌ చేశారు. నాలుగు రోజులయినా ఆమె ఆచూకీ లభించలేదన్నారు. ఘటన జరిగి నాలుగు రోజులవుతున్నా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు తమను పరామర్శించేందుకు రాలేదని మండిపడ్డారు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ఎన్నికల సమయంలో మాత్రమే ఓట్లు అడిగేందుకు వచ్చారని, ప్రజలకు ఆపద వచ్చినప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ కేసులో నిజానిజాలు వెలికితీసి, తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆదిలక్ష్మి కుమార్తె సత్యబిందు కోరారు. తన తల్లిని బంగారం కోసం చంపినట్లు నిందితుడు చెబుతున్నాడని, రేపు మళ్లీ నిజం చెప్పకపోతే పరిస్థితేమిటని ప్రశ్నించారు. గ్రామస్తులతో తాళ్లపూడి ఎస్సై టి.రామకృష్ణ చర్చించారు. కేసు వివరాలను వారికి తెలియజేశారు. బాధితులకు న్యాయం జరిగేలా అన్ని ఆధారాలూ సేకరించామని చెప్పారు. కొన్ని పత్రికలు, మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. బంగారం కోసమే ఆమెను యాకూబ్‌ హత్య చేసి, గోదావరిలో పడవేశాడని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement