సాక్షి, రాజమహేంద్రవరం: స్థానిక జిల్లా ప్రభుత్వం ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్‌గా డాక్టర్ కె.రాంబాబు నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నారు. 2021 ఫిబ్రవరి నుంచి 2026 జూన్ వరకు విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్) సూపరింటెండెంట్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుతం జీజీహెచ్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సోఫియా స్థానంలో రాంబాబును పదోన్నతిపై నియమిస్తూ, ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
3న మెగా జాబ్‌మేళా
సీటీఆర్‌ఐ: నగరంలోని దానవాయిపేటలో ఉన్న శ్రీ కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిలా డిగ్రీ కశాళాలలో మూడో తేదీ శనివారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. వికాస, సదరు కళాశాల సంయుక్త సమన్వయంతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జాబ్ మేళాలో సుమారు 33 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని వివిధ విభాగాల్లో ఉన్న సుమారు 1,600 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించడంతో పాటు విద్యార్హతలు, ధ్రువపత్రాల పరిశీలన తదితర ప్రక్రియల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్లు వెల్లడించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, బీటెక్, పీజీ తదితర విద్యార్హతలు కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు మూడో తేదీ ఉదయం 9 గంటలకు ధ్రువపత్రాల జిరాక్స్‌లతో హాజరు కావాలని కోరారు.
గోదావరి నిత్యహారతి
వేళల మార్పు
సీటీఆర్‌ఐ: శీతాకాలం ప్రవేశించడంతో గోదావరి పుష్కరఘాట్ వద్ద గోదావరి నిత్యహారతి సమయాల్లో మార్పు చేసినట్టు దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథరాజు బుధవారం తెలిపారు. గురువారం నుంచి మార్చి 31వ తేదీ వరకు సమయాల్లో మార్పు చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు సాయంత్రం ఏడు గంటల నుంచి 7.20 నిమిషాల వరకు నిత్యహారతి జరిగేదని ఇకపై సాయంత్రం 6.30 నిమషాలకు గోదావరి నిత్యాహారతులు ప్రారంభమై 6.50 నిమిషాలకు ముగుస్తాయని వెల్లడించారు.
వాసిరెడ్డి బాబిపై
అట్రాసిటీ కేసు
అపార్టుమెంట్‌లో జరిగిన ఘర్షణపై
పరస్పరం ఫిర్యాదులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం టీడీపీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు కుమారుడు వాసిరెడ్డి బాబిపై ప్రకాశ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. దీనిపై మోడల్ కాలనీలో నివాసముండే మాజీ ఎంపీ తనయుడు చేగొండి హరిరామజోగయ్య కుమారుడు చేగొండి వెంకట రామదాసు, అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పల్లవి ఎన్‌క్లేవ్‌లో వెంకటరామదాసు, అతని భార్య నివసిస్తున్నారు. ఆ అపార్ట్‌మెంట్‌లో చెరుకుచెర్ల అప్పారావు వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. వెంకటరామదాసు భార్య అపార్ట్‌మెంట్‌లో పువ్వులు కోసుకుంటుండగా అప్పారావు ఆమె పట్ల దురుసుగా, అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె విషయాన్ని తన భర్త వెంకటరామదాసుకు తెలిపింది. ఆయన వచ్చి అప్పారావును కొట్టారు. ఈ విషయాన్ని అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వాసిరెడ్డి బాబి సోదరి అతనికి ఫోన్ చేసి తెలిపింది. దీంతో బాబి తన అనుచరులతో వచ్చి రామదాసు, అతని భార్య, గుమస్తాలపై దాడి చేశాడు. దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదిలా వుండగా వాచ్‌మన్ అప్పారావు తనను కులం పేరుతో దూషించాడని కేసు నమోదు చేశారు. కాగా రామదాసు వద్ద గుమస్తాగా పనిచేస్తున్న సిద్ధార్థ సైతం తనను కులం పేరుతో దూషించి, తనపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఇరు పక్షాల రెండు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఒక కొట్లాట కేసు నమోదు చేశారు.
శనైశ్చరుని హుండీల
ఆదాయం రూ.9.12 లక్షలు
కొత్తపేట: కొత్తపేట మండలం మందపల్లిలో శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామి వారికి హుండీల ద్వారా రూ.9,12,351 ఆదాయం వచ్చింది. దేవదాయ, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్‌బాబు ఈ విషయం తెలిపారు. ఆరు నెలల 7 రోజుల అనంతరం బుధవారం ఉదయం హుండీలను తెరచి, ఆదాయం లెక్కించారు.


