గంజాయి బ్యాచ్ ఆగడాలను అరికట్టాలి
రాజమహేంద్రవరం సిటీ: జిల్లాలోని యర్నగూడెం వద్ద జాతీయ రహదారిపై గత నెల 31న గంజాయి బ్యాచ్ దాడిలో గాయపడిన ఏఆర్ కానిస్టేబుల్ వేముల వెంకటేశ్వరరావును వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ బుధవారం పరామర్శించారు. విధి నిర్వహణలో భాగంగా బస్టాప్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన నలుగురు యువకులను ప్రశ్నించగా వారిలో ఇద్దరు వారి వద్ద ఉన్న ఆయుధంతో వెంకటేశ్వరరావును తీవ్రంగా గాయపరచి పరారయ్యారు. చికిత్స అనంతరం ఇంటి వద్ద చికిత్స తీసుకుంటున్న ఆయనను బుధవారం పరామర్శించి దాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ నరసింహ కిషోర్ తనకు మంచి వైద్యం అందించడానికి చర్యలు తీసుకోవడం వల్ల ప్రస్తుతం కోలుకుంటున్నానని వెంకటేశ్వరరావు భరత్‌రామ్‌కు వివరించారు. ఈ సందర్భంగా భరత్‌రామ్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్‌లు విచ్చలవిడిగా సంచరిస్తూ దారుణాలకు తెగబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి రవాణా ముఠాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసు అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారిని అదుపు చేయకపోతే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందనడంలో సందేహం లేదన్నారు. తాము చాలా కాలం నుంచి గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలపై పోరాటాలు చేస్తూనే ఉన్నామన్నారు. గంజాయి రవాణా చేస్తున్న వారితో పాటు సేవిస్తున్న వారిని, వారిని ప్రోత్సహిస్తున్న వారిని కూడా అరెస్టు చేయాలని ఆయన కోరారు.


