మాకు న్యాయం ఎప్పుడు? | - | Sakshi
Sakshi News home page

మాకు న్యాయం ఎప్పుడు?

Oct 1 2026 12:35 AM | Updated on Oct 1 2026 12:35 AM

● కార్యవర్గాన్ని రద్దు చేయండి

● ‘జయలక్ష్మి’ సొసైటీ సభ్యుల డిమాండ్‌

● అరుపులు, కేకలతో ముగిసిన

మహాజన సభ

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): అధిక మొత్తం వస్తుందనే ఆశతో డిపాజిట్లు చేసి, మోసపోయిన తమకు న్యాయం ఎప్పుడు జరుగుతుందని జయలక్ష్మీ కో ఆపరేటివ్‌ సొసైటీ సభ్యులు ముక్తకంఠంతో ప్రశ్నించారు. సొసైటీ మహాజన సభ స్థానిక దంటు కళాక్షేత్రంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్‌ జి.త్రినాథరావు తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ పలువురు సభ్యులు మండిపడ్డారు. ప్రస్తుత కార్యవర్గ సభ్యులు రుణాల వసూలులో ఆసక్తి చూపడం లేదని, ఈ కార్యవర్గాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మొత్తం రికార్డు సీఐడీ ఆధీనంలో ఉండటంతో రుణాలు చెల్లించిన వారికి డాక్యుమెంట్లు ఇచ్చే పరిస్థితి లేదని కార్యవర్గ సభ్యులు వివరించారు. సహకార ట్రిబ్యునల్‌ వద్ద సంఘం దాఖలు చేసిన సివిల్‌ కేసుపై చర్చించారు. మహాజన సభకు ముగ్గురు డైరెక్టర్లు వరుసగా మూడుసార్లు హాజరు కాకపోవడంతో వారిని సభ్యులుగా తొలగిస్తున్నట్లు మహాజన సభలో ప్రకటించారు. ప్రస్తుత కార్యవర్గం అవినీతికి పాల్పడుతోందని సభ్యుడు రఘు భూషణ్‌ నిలదీశారు. తాను మాట్లాడుతూండగానే టూటౌన్‌ సీఐ మజ్జి అప్పలనాయుడు అడ్డు తగలడంపై ఆయన మండిపడ్డారు. ప్రస్తుత కార్యవర్గ సభ్యులు చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తే పోలీసులతో అరెస్టు చేయిస్తారా అని నిలదీశారు. ఈ నేపథ్యంలో రఘు భూషన్‌ను సీఐ పక్కకు తోసేశారు. సీఐ తన కాలర్‌ పట్టుకున్నారంటూ భూషణ్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభలో నిరసన తెలిపారు. ఆయనను స్టేషన్‌కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా మిగిలిన సభ్యులు అడ్డుకున్నారు. తాము కూడా స్టేషన్‌కు వస్తామని చెప్పడంతో భూషణ్‌ను సీఐ వదిలేశారు. సభ్యులు ఎటువంటి గొడవలూ పడకుండా చూసేందుకే వచ్చానని, కానీ, తాను తోసేశానంటూ సీఐ మండిపడ్డారు, దీనిపై కేసు నమోదు చేస్తానని పట్టుపట్టారు. ఇప్పటికే పలు కేసులతో సభ్యులు ఇబ్బంది పడుతున్నారని, మళ్లీ కేసులు ఎందుకని మిగిలిన వారు సర్ది చెప్పారు. మొత్తం మీద సభ్యుల అరుపులు కేకల నడుమ అజెండాలోని ఏ అంశంపై చర్చ జరగకుండానే మహాజన సభ ముగిసింది. సమావేశంలో జిల్లా శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement