మా ప్రాంతంలోని ప్రతి కుటుంబంతో మాకు పరిచయం ఉండేది. వృద్ధులు, ఒంటరి మహిళలు, పేద కుటుంబాల సమస్యలు మాకు తెలుసు. తక్కువ గౌరవ వేతనంతోనైనా సేవ చేయడానికి సిద్ధపడ్డాం. కానీ ప్రభుత్వం మమ్మల్ని కొనసాగించలేదు. ఇప్పుడు సోషల్ మీడియా ప్రచారానికి ఇన్‌ఫ్లూయెన్సర్లకు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేయడం చూస్తుంటే, మా బాధ మరింత పెరుగుతోంది. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్న వలంటీర్లకు విలువ ఇవ్వకుండా, ప్రచార వీడియోలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం సరైన విధానం కాదు.
– బండి వీరబాబు, వలంటీర్, రఘుదేవపురం, సీతానగరం మండలం
ప్రభుత్వం సమాధానం చెప్పాలి
వలంటీర్లకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం వచ్చినా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పనిచేశాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని కొనసాగిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఆ హామీని అమలు చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వ ప్రచారం కోసం సోషల్ మీడియాకు భారీగా చెల్లింపులు చేయాలనుకోవడం చూస్తే ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటో అర్థమవుతోంది. ప్రజల కోసం పనిచేసిన వారికి ఉపాధి కల్పించకుండా, ప్రచారం కోసం ప్రజాధనం ఖర్చు చేయడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
– పిసిని రాజేష్, వలంటీర్, రఘుదేవపురం, సీతానగరం మండలం


