వైఎస్సార్‌ సీపీ జోలికి వస్తే ఊరుకునేది లేదు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ జోలికి వస్తే ఊరుకునేది లేదు

Oct 1 2026 12:35 AM | Updated on Oct 1 2026 12:35 AM

● చంద్రబాబు, లోకేష్‌ పేర్లు చెప్పి

ఎస్పీలపై ఒత్తిడి తెస్తున్నారు

● ఎమ్మెల్యే మద్దిపాటికి

జక్కంపూడి స్ట్రాంగ్‌ కౌంటర్‌!

ద్వారకాతిరుమల: గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఘాటైన కౌంటర్‌ ఇచ్చారు. ద్వారకాతిరుమలలోని ఓ ఫంక్షన్‌ హాల్లో మంగళవారం రాత్రి మాజీ ఎంపీపీ బొండాడ మోహిని వెంకన్నబాబు ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీల ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో మాజీ హోం మంత్రి, వైఎస్సార్‌ సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి తానేటి వనిత, మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాసరావు, జక్కంపూడి రాజా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ తానేటి వనిత హోంమంత్రిగా ఉన్న సమయంలో ఎక్కడా అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడలేదని, ఒక్కరి మీద కూడా దొంగ కేసు పెట్టిన దాఖలాలు లేవని అన్నారు. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతానంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ‘చంద్రబాబుకు చెప్పనా.. లోకేష్‌కు చెప్పనా..’ అంటూ ఎస్పీలపై ఒత్తిడి తెచ్చి కేసులు నమోదు చేయిస్తున్నారని అన్నారు. దూబచర్లలో తాను మాట్లాడిన మాటలకు తనపై కేసు పెట్టారని, అంతే కాకుండా తనతో ఊసలు లెక్కపెట్టిస్తానని ఎమ్మెల్యే అన్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గతంలో తన తండ్రి జక్కంపూడి రామ్మోహనరావు, తల్లి విజయలక్ష్మిపై దాదాపు 80 కేసులు పెట్టారని అయినా ఏం చేయలేకపోయారని, తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అధికార మదంతో మాట్లాడితే కాలం దగ్గర్లోనే ఉందని అన్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ టీడీపీని ప్రతిపక్షం వైపు, వైఎస్సార్‌ సీపీని అధికార పక్షం వైపు నడిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రతి గ్రామంలో తమ పార్టీ కార్యకర్తలు తాము ప్రతిపక్షంలో ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయారని, మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రజలను ఓటు అడిగే హక్కు వైఎస్సార్‌ సీపీకే ఉందని పేర్కొన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో విజయభేరి మోగించేందుకు పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement