వీరి రూటు సెపరేటు! | - | Sakshi
Sakshi News home page

వీరి రూటు సెపరేటు!

Aug 22 2026 12:18 AM | Updated on Aug 22 2026 12:18 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో పదోన్నతుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. అర్హతలు, సీనియారిటీతో సంబంధం లేకుండా కొందరికి పదోన్నతులు కల్పించేందుకు భారీగా ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు బ్యాంకు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల పదోన్నతుల పేరుతో సుమారు రూ.2 కోట్ల మేర అక్రమ వసూళ్లు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదోన్నతులు పొందిన కొందరు ఉద్యోగుల సర్వీస్‌ రిజిస్టర్లలో (ఎస్‌ఆర్‌) సీనియారిటీని మార్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఉద్యోగంలో చేరిన వారిని సైతం పదేళ్లకు పైగా క్రితమే విధుల్లో చేరినట్లుగా రికార్డులు సృష్టించి పదోన్నతులు కల్పించినట్లు బ్యాంకు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అవకతవలు

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం ప్రాంతానికి చెందిన ఒక ఉద్యోగి సర్వీస్‌ రికార్డుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. సహకార సంఘం అధ్యక్షుడి సంతకంతో సర్వీస్‌ వివరాలను మార్చినట్లు, అనంతరం సీనియారిటీ ఆధారంగా పదోన్నతి పొంది ప్రస్తుతం ఊడిమూడి పీఏసీఎస్‌ సీఈఓగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి మరికొన్ని ఎస్‌ఆర్‌లను కూడా సృష్టించి పదోన్నతులు కల్పించినట్లు బ్యాంకు వర్గాల్లో చర్చ జరుగుతోంది. పి.గన్నవరం సహకార సంఘంలో ఒక ఉద్యోగి స్టాఫ్‌ అసిస్టెంట్‌గా 14 నెలల 29 రోజులు పనిచేసి, అనంతరం 8 నెలల 5 రోజులు వడ్డిపర్రు సహకార సంఘంలో పనిచేసినట్లు, ప్రస్తుతం అదే వ్యక్తి వడ్డిపర్రు సహకార సంఘంలో ఇన్‌చార్జ్‌ సీఈవోగా పనిచేస్తున్నట్లు ఎస్‌ఆర్‌లో నమోదు చేశారు. అయితే ఎక్కడ పనిచేస్తే అక్కడ సహకార సంఘ అధ్యక్షులతో ఎస్‌ఆర్‌లో సంతకాలు పెట్టించుకోవాల్సి ఉండగా ఆ వ్యక్తి వడ్డిపర్రు సహకార సంఘం అధ్యక్షుడితో మూడు చోట్ల సంతకాలు చేయించుకున్నారు.

ఇద్దరికి కీలక పదోన్నతులు

డీసీసీబీ పరిధిలో ఇటీవల ఇద్దరు ఉద్యోగులకు కల్పించిన పదోన్నతులు కూడా అనుమానాలకు తావిస్తున్నాయి. రాజమహేంద్రవరంలో సేల్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగికి అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (ఏజీఎం)గా పదోన్నతి లభించినట్లు సమాచారం. అదే విధంగా కాకినాడ జిల్లాలో సీనియర్‌ ఏజీఎంగా పనిచేస్తున్న మరో ఉద్యోగికి ఇన్‌చార్జి డీజీఎం బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ రెండు పదోన్నతుల విషయంలోనూ భారీగా ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సమగ్ర విచారణకు డిమాండ్‌

డీసీసీబీలో కొంత కాలంగా చోటుచేసుకున్న పదోన్నతులపై సర్వీస్‌ రిజిస్టర్లు, సీనియారిటీ జాబితాలు, నియామక ఉత్తర్వులు, పదోన్నతి కమిటీ నిర్ణయాలు, ఉద్యోగుల అర్హతలు, ఆర్థిక లావాదేవీలను సమగ్రంగా పరిశీలించాలని ఉద్యోగులు, సహకార రంగానికి చెందిన పలువురు కోరుతున్నారు. రూ.2 కోట్ల మేర ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు నిజమా, ఎవరెవరి పాత్ర ఉంది, సర్వీస్‌ రిజిస్టర్లలో మార్పులు జరిగాయా అన్న విషయాలపై ఉన్నతస్థాయి విచారణ జరిగితే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

జనసేన నేత పాత్రపై ఆరోపణలు

పదోన్నతుల వ్యవహారంలో ఓ జనసేన నేత కీలకంగా వ్యవహరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి సిఫారసులు చేయడంతో పాటు వ్యవహారాలను చక్కదిద్దడంలో ఆయన పాత్ర ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. కోనసీమ జిల్లా మాదిరిగా కాకినాడ జిల్లాలో పలు సహకార సంఘాల్లో తప్పుడు ఎస్‌ఆర్‌లు సృష్టించి ఉద్యోగాలు పదోన్నతుల పేరుతో భారీగా దండుకొనేందుకు సంబంధిత జనసేన నేత పన్నాగం పన్నినట్లు తెల్సింది. కానీ దీనికి జిల్లా సహకార శాఖ అధికారులు మోకాలడ్డు వేయడంతో కాకినాడ జిల్లాలో అక్రమాలకు అడ్డుకట్టపడిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

డీసీసీబీలో పదోన్నతుల మాయాజాలం!

డబ్బులిచ్చి ప్రమోషన్లు పొందారనే

ఆరోపణలు

రూ.రెండు కోట్ల మేర ముడుపులు

సర్వీస్‌ రిజిస్టర్లలో

అక్రమ మార్పులపై అనుమానాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement