ముస్లింలపై దుష్ప్రచారం దారుణం | - | Sakshi
Sakshi News home page

ముస్లింలపై దుష్ప్రచారం దారుణం

Aug 22 2026 12:18 AM | Updated on Aug 22 2026 12:18 AM

తప్పు చేసిన ఎవరైనా చట్టం ముందు సమానులే

సాధిక్‌ ఖాన్‌ ఘటనతో మతానికి సంబంధం ఏమిటి?

ముస్లిం మైనారిటీ జేఏసీ కో కన్వీనర్‌ జవహర్‌ అలీ

కాకినాడ క్రైం: పంచాయతీ రాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం మూకుమ్మడి ఆత్మహత్య ఘటనలో సాధిక్‌ ఖాన్‌ అంశం తెరమీదికి వచ్చినప్పటి నుంచి ముస్లిం సమాజాన్ని కించపరిచేలా కొందరు దారుణమైన ప్రచారం చేస్తున్నారని ముస్లిం అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ (మా) రాష్ట్ర అధ్యక్షుడు, ముస్లిం మైనారిటీ జేఏసీ కో కన్వీనర్‌ ఎండీ జవహర్‌ అలీ అన్నారు. ఈ మేరకు కాకినాడ గంజాం వారి వీధిలోని తన కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఏ మూల ఏం జరిగినా ముస్లింలతో ముడిపెట్టడం పరిపాటిగా మారిందన్నారు. తప్పు చేసిన వ్యక్తిని కేవలం వ్యక్తిగతంగానే చూడాలి తప్ప యావత్‌ కులానికో, మతానికో ఆపాదించడం తగదని హితవు పలికారు. హిందూ ముస్లింల మధ్య తారతమ్యాలు సృష్టించి, లేనిపోని గొడవలు పెట్టి, తమ పబ్బం గడుపుకోవడానికి కుటిల యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రశాంతతకు మారుపేరైన కాకినాడ నగరంలో ముస్లింలు, హిందువులతో సహా మిగిలిన మతస్తులు అందరితోనూ ఎంతో సోదరభావంతో మెలుగుతారన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా ముస్లింలపై చేస్తున్న దుష్ప్రచారాలకు అడ్డూ అదుపూ లేదని, అడ్డుకునే నాథుడు కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు. తప్పు చేసే ఏ ఒక్కరికీ తమ మద్దతు ఉండదని, చట్టం ముందు కులమతాలకు అతీతంగా ఎవరైనా సమానులేనని జవహర్‌ అలీ స్పష్టం చేశారు. సమావేశంలో మా జాయింట్‌ సెక్రటరీ యజజుద్దీన్‌, వైఎస్సార్‌ సీపీ మైనారిటీ నాయకుడు ఎండీ అస్గర్‌, జేఐహెచ్‌ కాకినాడ నాయకులు ఎండీ రహత్‌ షరీఫ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement