దేవరపల్లి: పొగాకు బోర్డు అనుమతించిన మేరకే పంట సాగు చేయాలని బోర్డు కార్యదర్శి డి.వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు. సోమవారం గోపాలపురం పొగాకు వేలం కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. అనంతరం వేలం కేంద్రం వద్ద రైతులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పొగాకు సాగులో కొత్త నిబంధనలను వివరించారు. 2025–26 సీజన్‌లో అధిక ఉత్పత్తి కారణంగా మార్కెట్‌లో ధరలు తగ్గి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. 2026–27 సీజన్‌లో పొగాకు (ఎఫ్‌సీవీ) సాగు విస్తీర్ణం, ఉత్పత్తిని పరిమితం చేయాలని బోర్డు నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తిని 170 మిలియన్ల కిలోల నుంచి 81 మిలియన్ల కిలోలకు పరిమితం చేయాలని అధికారులు తేల్చారన్నారు. అధిక ఉత్పత్తి వల్ల ధరలు పడిపోకుండా రైతులకు ముందస్తుగా అవగాహన కల్పించనున్నట్టు ఆయన తెలిపారు. తక్కువ నాణ్యత గల పొగాకుకు గిట్టుబాటు ధర వచ్చేలా కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వం సూచించిందన్నారు. గ్రామీణ, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా రైతు సంక్షేమ పథకంలో ప్రభుత్వ రుసుం రూ. 500 నుంచి రూ.1,325కు పెంచినట్టు వేణుగోపాల్ తెలిపారు. మరణించిన రైతు కుటుంబానికి ఆర్థిక సాయాన్ని పెంచారన్నారు. విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా పథకాన్ని అమలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. బోర్డు రీజినల్ మేనేజర్ జె.సురేంద్రకుమార్, వేలం నిర్వహణాధికారి బి.శ్రీహరి, ఐటీసీ మేనేజర్ కొట్రేషి, పీఎస్‌ఎస్‌హెచ్ కంపెనీ ప్రతినిధి రఘురామరాజు, జీపీఐ కంపెనీ ప్రతినిధి జనార్దన్‌రెడ్డి, బోర్డు మాజీ వైస్ చైర్మన్ గద్దే శేషగిరిరావు పాల్గొన్నారు.


