రెడ్‌బుక్‌ రాజ్యం.. ప్రజాస్వామ్యం అపహాస్యం | - | Sakshi
Sakshi News home page

రెడ్‌బుక్‌ రాజ్యం.. ప్రజాస్వామ్యం అపహాస్యం

Aug 11 2026 12:18 AM | Updated on Aug 11 2026 12:18 AM

డీఎస్సీ స్కామ్‌పై ర్యాలీలకు

వైఎస్సార్‌ సీపీ ప్రణాళిక

అడ్డుకోవడమే లక్ష్యంగా

కూటమి పెద్దల కుయుక్తులు

అనుమతులు నిరాకరిస్తూ

హడావుడిగా నోటీసులు

నివ్వెరపోతున్న ప్రజాస్వామ్యవాదులు

సాక్షి, రాజమహేంద్రవరం: రెడ్‌బుక్‌ రాజ్యంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైపోతోంది. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు పోలీసు శాఖను చంద్రబాబు అండ్‌ కో ఇష్టారీతిన దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా వైఎస్సార్‌ సీపీ నాయకులను వేధించడమే లక్ష్యంగా కూటమి పాలన సాగుతోంది. ఈ క్రమంలో పోలీసులు మరో అడుగు ముందుకేసి ఆదివారం అర్ధరాత్రి, సోమవారం వేకువజామున వారి ఇళ్లకు చేరుకుని, తీవ్ర నేరాలకు పాల్పడినట్టు.. హడావుడి చేశారు. సోమవారం నిర్వహించతలపెట్టిన ర్యాలీలకు అనుమతి లేదంటూ నోటీసులు అందించారు. సర్కారు నియంతృత్వ పోకడలు చూసి ప్రజాస్వామ్యవాదులు నివ్వెరపోతున్నారు.

ఉద్యమం ఉధృతమవడంతో..

డీఎస్సీ స్కామ్‌పై వైఎస్సార్‌ సీపీ చేపట్టిన దశల వారీ ఉద్యమం అన్ని ప్రాంతాల్లోనూ ఉధృతంగా సాగుతోంది. ఇందులో భాగంగా నియోజకవర్గ కేంద్రాల్లో నాలు గు రోజులు చేపట్టిన రిలే దీక్షలకు అన్ని వర్గాల నుంచీ విశేష మద్దతు లభించింది. దీనికి కొనసాగింపుగా సోమవారం భారీ ర్యాలీలకు పార్టీ అధిష్టానం పిలుపునివ్వడంతో కూటమి పెద్దలకు భయం పట్టుకుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే విషయాన్ని ప్రజలందరూ నమ్ముతున్నారని, ఈ ర్యాలీలు విజయవంతమైతే ప్రభుత్వ ప్రతిష్ట దిగజారుతుందనే ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా వైఎస్సార్‌ సీపీ డిమాండ్‌ చేస్తున్నట్లు సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే మంత్రి లోకేశ్‌ జైలుకెళ్లాల్సి వస్తుందనే ఆందోళన ఆ పార్టీ కేడర్‌లో నెలకొంది. ఈ నేపథ్యంలోనే ర్యాలీలను అడ్డుకునేందుకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు.

అర్ధరాత్రి వేళ తలుపులు తట్టి..

● డీఎస్సీ స్కామ్‌కు వ్యతిరేకంగా తలపెట్టిన ర్యాలీలకు అనుమతి కోరుతూ వైఎస్సార్‌ సీపీ నాయకులు ముందుగానే దరఖాస్తు చేసుకున్నారు. ఇంతలో కూటమి పెద్దల నుంచి ఒత్తిడి రావడంతో పోలీసులు ఆదివారం రాత్రి రంగప్రవేశం చేశారు. రాత్రి 10 గంటల సమయంలో రామచంద్రపురం చేరుకుని మరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకు నోటీసులు అందించారు. ఆయన నిరాకరించడంతో సోమవారం ఉదయం మళ్లీ ఇంటికొచ్చి నోటీసులు ఇచ్చారు.

● జక్కంపూడి రాజాకు నోటీసులు అందించిన పోలీసులు ఆయన రాజానగరం వెళ్లకుండా హౌస్‌ అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. రాజమహేంద్రవరం ప్రకాష్‌ నగర్‌లోని ఆయన ఇంటి వద్దకు భారీగా చేరుకుని, అక్కడి రహదారులను బారికేడ్లతో పూర్తిగా మూసేశారు. దీంతో, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

● ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు రామచంద్రపురంలో నోటీసులు అందించేందుకు పోలీసులు వెళ్లగా.. ఆయన అక్కడి నుంచి తప్పించుకుని, మండపేట చేరుకుని ర్యాలీలో పాల్గొన్నారు.

● మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డికి ఆదివారం రాత్రి నోటీసులు అందించిన పోలీసులు అనపర్తిలో హౌస్‌ అరెస్టు చేశారు.

● ఉండ్రాజవరంలో వైఎస్సార్‌ సీపీ అగ్రికల్చరల్‌ విభాగం స్టేట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బూరుగుపల్లి సుబ్బారావుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇంటి నుంచి ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాసనాయుడు ర్యాలీకి వెళ్లకుండా చాలా సేపు అడ్డుకున్నారు.

● దేవరపల్లి, కొవ్వూరు నియోజకవర్గాల్లోని పలువురు నాయకులకు సైతం ఆదివారం రాత్రి నోటీసులు అందించారు.

భరత్‌రామ్‌ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత

రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ, వైఎస్సార్‌ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్‌కు పోలీసులు ఆదివారం రాత్రి నోటీసులు అందించి, హౌస్‌ అరెస్టు చేశారు. సోమవారం ఉదయం భారీగా చేరుకున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తల సాయంతో ఆయన ర్యాలీకి సిద్ధమైనప్పటికీ పోలీసులు అనుమతించలేదు. సుమారు గంటకు పైగా నాయకులు, కార్యకర్తలు ప్రతిఘటించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒక దశలో భరత్‌రామ్‌ గేటు దాటి రోడ్డు పైకి చేరుకునేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ప్రభుత్వ నిరంకుశత్వంపై ఆయన ఈ సందర్భంగా ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement