అనపర్తి: తన తల్లి మృతిపై సందేహాలున్నాయని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు బిక్కవోలు ఎస్సై వి.రవిచంద్రకుమార్ తెలిపారు. ఈ మేరకు ఖననం చేసిన మృతదేహాన్ని సోమవారం వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు మారోజు రత్నం(65)కు నలుగురు సంతానం. భర్త మరణానంతరం ఆమె మండల కేంద్రమైన బిక్కవోలులోని గాజుల వారి వీధిలో ఒంటరిగా నివాసం ఉంటున్నారని తెలిపారు. వృద్ధురాలు ప్రతిరోజూ సుమారు 8 సవర్ల 8 బంగారు గాజులు, సుమారు 5 సవర్ల బంగారు చంద్రహారం, 2 సవర్ల బంగారు గొలుసు, 2 సవర్ల బంగారు చెవిపోగులు (మాటీలు), వెండి కాలి గజ్జెలు ధరించేది. ఫిర్యాదుదారుడు మృతురాలి కుమారుడు రాంబాబు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తన తల్లిని చూడడానికి ఇంటికి వెళతారని ఈ నెల 4న ఉదయం సుమారు 8 గంటలకు ఫిర్యాదుదారు తన తల్లి ఇంటికి వెళ్లి, ఆమెకు అల్పాహారం ఇచ్చి పనికి వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి సుమారు 8 గంటలకు, ఫిర్యాదిదారు తన తల్లిని చూడటానికి తిరిగి వచ్చినప్పుడు, ఆమె మంచం మీద అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే సమీపాన ఆర్‌ఎంపీ వైద్యుడిని పిలిపించి ఆమెను పరీక్షించిన తర్వాత, ఆమె మరణించినట్లు వైద్యుడు ప్రకటించారు. దీంతో రాంబాబు బంధువులకు తల్లి మరణ వార్తను తెలియజేశారు. మరుసటి రోజు ఉదయం, అంత్యక్రియలకు ముందు మృతురాలి కుమార్తె మృతురాలికి స్నానం చేయిస్తుండగా, ఆమె ధరించిన ఎనిమిది బంగారు గాజుల్లో రెండు గాజులు, మూడు పొరల బంగారు గొలుసులో ఒక పొర కనిపించకుండా పోయినట్లు గమనించారు. ఆ తర్వాత ఆమె పొట్టపై గీతలు, పెదవులపై ఎండిన రక్తపు మరకలను గమనించారు. మరణం సహజ మరణం కాకపోవచ్చని అనుమానించి గ్రామ పెద్దలకు, బంధువులకు ఈ విషయం తెలియజేశారు. అయినప్పటికీ, వారు అంత్యక్రియలను కొనసాగించమని సలహా ఇచ్చారు. ఈ నేపథ్యంలో 5న ఉదయం సుమారు 11 గంటలకు బిక్కవోలులోని దేవుడి మాన్యం వద్ద ఉన్న విశ్వబ్రాహ్మణ శ్మశానవాటికలో రత్నం మృతదేహాన్ని ఆచారం ప్రకారం ఖననం చేశారు. తన తల్లి మరణించిన పరిస్థితులు, కనిపించకుండా పోయిన బంగారు ఆభరణాల గురించి మృతురాలి కుటుంబబ సభ్యులకు తీవ్రమైన అనుమానాలు కొనసాగడంతో, వారు ఈనెల 8న బిక్కవోలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. దీనిలో భాగంగా సోమవారం మృతదేహాన్ని వెలికి తీసి పరిశీలించినట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో అనపర్తి సీఐ సుమంత్, తహసీల్దార్ టీవీఎస్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.


