వైద్య విద్యార్థినుల ఆవేదన
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంత క్రూరం ఏంటో.. బయట తిరగాలంటే భయమేస్తోందంటూ వైద్య విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం ప్రకాశ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు మెడికో ప్రియాంక తండ్రి, కుటుంబ సభ్యులు వస్తున్నారన్న సమాచారం తెలిసి ఆదివారం ఇక్కడికి రాజానగరం జీఎస్‌ఎల్ కళాశాలలో వైద్య విద్యనభ్యసిస్తున్న ప్రియాంక తోటి స్నేహితులు, మెడికోలు చేరుకున్నా రు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తమతో కలిసి తిరిగిన ప్రియాంక అకారణంగా బలైపోయిందని వారు ఆవేదన చెందారు. కారుతో ఢీకొట్టి దుర్మార్గంగా వ్యవహరించిన ఆ ఇద్దరిని కఠినంగా శిక్షించాలన్నారు.
● కావాలనే ఢీకొట్టారు
ప్రియాంకను కారుతో కావాలనే ఢీకొట్టారు. మేము సీసీ పుటేజీ చూశాం. అందులో స్పష్టంగా కనిపిస్తోంది. కావాలనే మూడుసార్లు ఢీకొట్టారు. దానివల్లే ప్రియాంక చనిపోయింది. ఎప్పుడూ నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ ఉండే ప్రియాంకకు న్యాయం జరగాలి. నిందితులకు శిక్ష పడాలి. లేకపోతే చట్టాలపై ప్రజలకు నమ్మకం పోతుంది.
–సౌమ్య, మెడికల్ విద్యార్థిని, జీఎస్‌ఎల్ కళాశాల●
● నిందితులను వదలకూడదు
ప్రియాంక మేడం మామల్ని చాలా బాగా చూసుకునేవారు. మేము ఆమె వద్ద నర్సింగ్ విద్యార్థినిగా శిక్షణ తీసుకుంటున్నాం. మాతో చాలా బాగుండేవారు. ఎప్పుడూ నవ్విస్తూ ఉండేవారు. అటువంటి ఆమె ఈ రోజు అన్యాయంగా బలైపోయారంటే రేపొద్దున్న మా పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని భయమేస్తోంది. నిందితులను వదలకూడదు. అటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. –దీవెన, నర్సింగ్ విద్యార్థిని ●
● హేయమైన చర్య
ప్రియాంక నా రూమ్‌మేట్. శనివారం ఇంటికి వెళ్లి సోమవారం తిరిగి వచ్చింది. తర్వాత సినిమాకు వెళ్లింది. తను సినిమాకి వెళ్లడం తప్పు కాదు. కావాలని కారుతో ఢీకొట్టడం హేయమైన చర్య. ప్రియాంక నా సీనియర్, కానీ మేము చాలా స్నేహంగా ఉండేవాళ్లం. ప్రియాంకకు నిశ్చితార్థం అయ్యిందని అంటున్నారు. అటువంటిదేమీ లేదు. నిందితులను కఠినంగా శిక్షించాలి.
–తేజస్విని, మెడికో, ప్రియాంక స్నేహితురాలు ●


