రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరంలో ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద జరిగిన ఘటనలో మెడికో ప్రియాంక మృతి చెందగా, ఆమె కుటుంబాన్ని మాల్ యాజమాన్యం ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి ఆ మాల్ వద్ద వైఎస్సార్ సీపీ యువ నాయకుడు జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థులతో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రియాంకను కారుతో పలుమార్లు ఉద్దేశ పూర్వకంగా ఢీకొని ఆమె మృతికి కారకులైన ఇద్దరు యువకులపై హత్య కేసు నమోదు చేయాలన్నారు. మద్యం తాగిన వ్యక్తులను మాల్ యాజమాన్యం ఏ విధంగా లోపలకు అనుమతించిందని ప్రశ్నించారు. ఇందులో సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తుందన్నారు. యువజన నేత జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ మాల్‌లోకి తాగుబోతులు రావడంతోనే ఈ ఘటన జరిగిందన్నారు. కనీసం మానవత్వం లేకుండా మాల్ యాజమాన్యం ప్రవర్తించడం, ఘటనపై పోలీసులకు సమాచారం కూడా ఇవ్వకపోవడం వారి నిర్లకా్‌ష్య్‌నికి అద్దం పడుతుందన్నారు. ప్రియాంక మృతిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని గణేష్ డిమాండ్ చేశారు. అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నీలి ఆనంద్, నాయకులు నందెపు శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ పోలు విజయలక్ష్మి, మహిళా నాయకురాలు సంకిస భవానీప్రియా, బీసీ మహిళా నాయకురాలు బర్ల సీతారత్నం, సరిత, రాణి, తగరం సోము, ఏఎస్‌ఎఫ్ నాయకుడు విజయ్ తదితరులు పాల్గొన్నారు.


