ప్రకాశంనగర్: జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ప్రశాంతంగా నిర్వహించినట్లు డీఈఓ కంది వాసుదేవరావు తెలిపారు. రాజమహేంద్రవరంలోని రాజీవ్‌గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్, ఇయాన్ డిజిటల్ జోన్ లూథరగిరిలో మూడో రోజు శనివారం ఈ పరీక్షలు జరిగాయన్నారు. రెండు సెషన్లలో తెలుగు పేపర్–1 పరీక్ష జరిగిందన్నారు. సెషన్–1కు 940 మందికి 885 మంది, సెషన్–2లో 940 మందికి 910 మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. మొత్తం 85 మంది గైర్హాజరైనట్టు తెలిపారు. డిపార్ట్‌మెంట్ అధికారులుగా అర్బన్ ఎంఈఓ ఎంవీఎం సుబ్రహ్మణ్యం, హెచ్‌ఎం కోలా సత్యనారాయణ, జీవీవీఎస్ గణపతిరావు వ్యవహరిస్తున్నారని తెలిపారు.
సత్యదేవా శరణు శరణు
అన్నవరం: ఆషాఢ బహుళ దశమి, శనివారం కావడంతో అన్నవరం శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం శనివారం భక్తులతో కిక్కిరిసింది. సత్యదేవుని దర్శనానికి రెండు గంటలు, రూ.200 టిక్కెట్‌తో అంతరాలయ దర్శనానికి గంట సమయం పట్టింది. రూ.300 వ్రతా లు ఆచరించేందుకు భక్తులు వ్రత మండపాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. సుమారు 40 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు రెండు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ. 40 లక్షల ఆదాయం సమకూరింది. ఐదు వేల మందికి అన్నప్రసాదం అందించారు. కాగా, ఆ షాఢ బహుళ ఏకాదశి సందర్భంగా ఆదివారం కూడా రత్నగిరిపై రద్దీ నెలకొనే అవకాశం ఉంది. ఆలయ ప్రాకారంలో ఉదయం 10 గంటల నుంచి టేకు రథంపై సత్యదేవుడు, అమ్మవారిని ఊరేగిస్తారు.
ఏలేరు తీరంలో
విహారయాత్రలు నిషేధం
జగ్గంపేట: భావవరం గ్రామ సమీప అటవీ ప్రాంతంలోని ఏలేరు ప్రాజెక్టు నదీ తీరంలో విహార యాత్రలకు ఎటువంటి అనుమతులు లేవని, ఈ ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించినట్లు జగ్గంపేట ఎస్సై రఘునాథరావు తెలిపారు. కొంత కాలంగా ఈ ప్రాంతానికి పర్యాటకుల సందడి పెరిగింది. వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం జరగడంతో సెలువు రోజుల్లో పెద్ద ఎత్తున వస్తు న్నారు. కొద్ది రోజుల క్రితం ఓ కళాశాలకు చెందిన విద్యార్థులు విహారయాత్రకు వచ్చి ఓ యువకుడు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ ప్రాంతంలో నది బాగా లోతుగా ఉండడంతో నీటిలో దిగితే ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని ఆయన తెలిపారు. అంతేకాకుండా రిజర్వ్ ఫారెస్టులోకి రావడానికి కూడా నిబంధనల ప్రకారం వీలుకాదని చెప్పారు. భావవరం ప్రాంతంలో నిషేధిత ప్రాంతంగా బోర్డులు ఏర్పాటు చేశామన్నారు.


