నవోదయానికి అడుగేద్దాం! | - | Sakshi
Sakshi News home page

నవోదయానికి అడుగేద్దాం!

Aug 9 2026 1:40 AM | Updated on Aug 9 2026 1:40 AM

రాయవరం: విద్యార్థుల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు జవహర్‌ నవోదయ విద్యాలయ సమితిలో ప్రస్తుత విద్యాసంవత్సరం 6వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు మరో రెండు రోజులే గడువు. ఈ నెల 10తో గడువు ముగియనున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా పెద్దాపురంలోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. కాగా శనివారం నాటికి 7,770 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గత ఏడాది 9,279 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది అంతకు పదిశాతం ఎక్కువ దరఖాస్తులు వస్తాయని అధికారులు భావించారు. కానీ దానికి ఇప్పటి వరకు 1,509 దరఖాస్తులు తక్కువ వచ్చాయి. పెద్దాపురం నవోదయ విద్యాలయాల్లో మొత్తం 80 సీట్లు ఉన్నాయి. కాగా ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఐదో తరగతి విద్యార్థులు సుమారు 60 వేల మంది ఉన్నారు.

పరీక్షా విధానమిదీ

ఈ ఏడాది నవంబరు 28న ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్దేశిత కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిషు, తెలుగు మాధ్యామాల్లో నిర్వహించే ప్రవేశ పరీక్షలో 80 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ విధానంలో 100 మార్కులకు పరీక్షకు, రెండు గంటల సమయాన్ని కేటాయిస్తారు. మెంటల్‌ ఎబిలిటీపై 40 ప్రశ్నలు, 50 మార్కులకు, గణితం (అర్థమెటిక్‌), భాషపై ఒక్కొక్క విభాగానికి 20 ప్రశ్నలు వంతున 40 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. దివ్యాంగులకు 40 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయిస్తారు. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి మొదటి రెండేళ్లు తెలుగు/ఇంగ్లీషు భాషల్లో బోధిస్తారు.

పోటీ విధానం అలవడుతుంది

జవహర్‌ నవోదయ విద్యాలయలో సీటు సంపాదించడాన్ని ప్రతిష్టగా భావిస్తారు. ఇందుకోసం పాఠశాలల్లోని ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాల్సి ఉంది. సీటు రాకపోయినప్పటికీ నిరాశ చెందకుండా, ఇతర పోటీ పరీక్షలకు హాజరవడం అలవడుతుందని అధికారులు చెబుతున్నారు.

గత ఏడాదితో పోలిస్తే

దరఖాస్తులు ఇలా..

జిల్లా 2026–27 2027–28

కోనసీమ 2,233 2,272

తూర్పుగోదావరి 2,521 1,745

కాకినాడ 4,215 3,753

ఆరో తరగతిలో ప్రవేశానికి

దరఖాస్తుల ఆహ్వానం

దాఖలుకు రెండు రోజులే గడువు

గతేడాది వచ్చిన దరఖాస్తులు 9,279

ఈ ఏడాదిలో ఇప్పటికి వచ్చినవి 7,770

నవంబరు 28వ తేదీన ప్రవేశ పరీక్ష

రేపటితో ముగుస్తున్న గడువు

జవహర్‌ నవోదయ విద్యాలయంలో ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు చేసుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. ఆ మేరకు ఉపాధ్యాయులు కృషి చేయాలి.

– ఎస్‌.శరత్‌చంద్ర కీర్తి, ప్రిన్సిపాల్‌,

జవహర్‌ నవోదయ విద్యాలయ, పెద్దాపురం

దరఖాస్తుల పెంపుకు కృషి చేయాలి

జవహర్‌ నవోదయ ప్రవేశ పరీక్షలో గ్రామీణ విద్యార్థులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకునేలా ఎంఈఓలు చర్యలు తీసుకోవాలి. విద్యార్థులతో ఈ పరీక్షలు రాయించడం వల్ల వారిలో పోటీ పరీక్షలను ఎదుర్కోగలిగే ఆత్మ విశ్వాసం ఏర్పడుతుంది.

– జి.నాగమణి, ఆర్‌జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement