● వాడపల్లి వేంకటేశుని దర్శించిన భక్తులు
● లక్ష మందికి మించి రాక
● ఏర్పాట్లను పర్యవేక్షించిన కమిటీ సభ్యులు
ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరుని దర్శనానికి శనివారం భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. వారి గోవింద నామస్మరణతో మాడవీధులు మార్మోగాయి. భక్తులు ఏడు ప్రదక్షిణలు చేసి ఏడేడు జన్మల పుణ్యఫలంగా భావించారు. స్వామివారిని సుమారు 80 వేల నుంచి లక్షకు పైగా భక్తులు దర్శించారని, భారీగా ఆదాయం కూడా సమకూరిందని ఆలయ ఈవో, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. తెల్లవారుజాము నుంచే రావడం మొదలుపెట్టిన భక్తులు గౌతమీ గోదావరిలో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. కాలి నడకన సైతం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భారీ సంఖ్యలో వచ్చిన వాహనాలతో ఆలయ కారు పార్కింగ్, కొత్త వంతెన, లొల్ల లాకుల వద్ద తరచూ ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడ్డాయి. సుప్రభాత సేవ, తొలి హారతి, నిరాజనం, ఐశ్వర్య లక్ష్మీ హోమం, బాల భోగం వంటి కార్యక్రమాలను ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి ఉచిత అన్న, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆర్యవైశ్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భక్తుల వసతుల కల్పనకు, ప్రత్యేక వైద్య శిబిరాల నిర్వహణకు ఆలయ ఈవో, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది, ఆలయ అర్చకులు, వేద పండితులు, సేవా కార్యకర్తలు కృషి చేశారు. అలాగే ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు వాడపల్లి సుందర శేషావతారం స్వామి వారి పూజలు, సేవలు, కై ంకర్యాలను పర్యవేక్షించారు.


