అన్నప్రసాదాన్ని ఆస్వాదిస్తూ ఆరగించనీ స్వామీ | - | Sakshi
Sakshi News home page

అన్నప్రసాదాన్ని ఆస్వాదిస్తూ ఆరగించనీ స్వామీ

Aug 9 2026 1:40 AM | Updated on Aug 9 2026 1:40 AM

తాత్కాలిక ఇరుకు షెడ్డులో భోజనాలు వడ్డించుకుంటున్న భక్తులు

ఎండలో క్యూలో వేచి ఉన్న భక్తులు

ఆత్రేయపురం: పిల్లా పాపలతో అన్న ప్రసాదం తినే భాగ్యం ఎప్పుడు స్వామీ అని భక్తులు వాడపల్లి వేంకటేశ్వరుని ప్రశ్నిస్తున్నారు. ప్రతి శనివారం ఇతర రాష్ట్రాలు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే లక్షకు పైగా వచ్చే భక్తులలో అన్న ప్రసాదం స్వీకరించే భక్తులు 30 నుంచి 40 వేల మంది ఉంటారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆలయ అభివృద్ధి పనులను పరుగులు పెట్టించారు. సుమారు రూ.16 కోట్లతో చేపట్టిన పనుల్లో భాగంగా ప్రాకార మండపాన్ని పూర్తి చేయగా, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనుమతితో రూ.2.8 కోట్లతో కోనేటి అభివృద్ధి పనులను ప్రారంభించారు. అలాగే రూ.6.25 కోట్లతో వకుళమాత అన్నదాన భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. తదనంతర కాలంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఆ పనులన్నింటికీ బ్రేకులు పడ్డాయి. ఈ పనులపై నిత్యం ఆలయ నిర్వాహకులు, అధికారులు సమీక్షిస్తూనే ఉన్నప్పటికీ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టున్నాయి.

విరాళాలు విరివిగా వస్తున్నా..

అన్నదాన భవనానికి భక్తులు భారీగా విరాళాలు ఇస్తుండడంతో ఆ నిధులు సుమారు రూ.12 కోట్లకు చేరుకున్నాయి. అయినప్పటికీ పనుల్లో పురోగతి లేదు. దీంతో పిల్లా పాపలతో వచ్చిన భక్తులు అన్న ప్రసాదం తినడానికి నానా అవస్థలు పడుతున్నారు. క్యూలైన్లలో కంచాలు తీసుకుని, అన్నం, కూరలు, సాంబారు వడ్డించుకుని తిందామనుకుంటే, సమీపంలో తాగునీరు లేక తిరిగి వడ్డించుకోలేక వారి బ్యాగులు మోయలేక కూర్చోలేక నుంచో లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.

పట్టించుకోని కమిటీ సభ్యులు..

ఆలయ కమిటీ సభ్యులు శనివారం భక్తుల దర్శనాలకు సంబంధించిన వ్యవహారాలు తప్ప, అక్కడి భక్తుల ఇబ్బందులు పట్టించుకోవడంలేదు. అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నా ఉత్తుత్తి పర్యటనలు.. దేవదాయ శాఖ మంత్రి నుంచి, కమిషనర్‌ వరకు పనులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడంలేదు. తద్వారా అన్నదాతల ఆశయానికి ఇక్కడ తూట్లు పొడుస్తున్నారు. సౌకర్యవంతంగా అన్న ప్రసాదం తినేలా భవనాన్ని త్వరగా నిర్మించాలని భక్తులు కోరుతున్నారు.

వకుళ మాత భవనం కోసం

భక్తుల ఎదురుచూపు

దాతల విరాళాలు

రూ.12 కోట్లకు చేరినా జాప్యమే

నత్తనడకన వాడపల్లిలో అభివృద్ధి పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement