డీఎస్సీ అక్రమాల నిగ్గు తేల్చే వరకూ పోరాటం | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అక్రమాల నిగ్గు తేల్చే వరకూ పోరాటం

Aug 6 2026 2:14 AM | Updated on Aug 6 2026 2:14 AM

కపిలేశ్వరపురం: రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చేంత వరకూ వైఎస్సార్‌ సీపీ పోరాటం కొనసాగిస్తుందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు మండపేట నియోజకవర్గంలో ఉద్యమ కార్యాచరణ చేపట్టామని పేర్కొన్నారు. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖా మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌ చేస్తూ ప్రజలతో కలసి పోరాడతామన్నారు. ఈ మేరకు మండపేట మున్సిపల్‌ కార్యాలయం ఎదుట గురువారం నుంచి మూడు రోజులు పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నామని తెలిపారు. గురువారం మండపేట రూరల్‌ మండల నాయకులు, కార్యకర్తలు, శుక్రవారం రాయవరం, శనివారం కపిలేశ్వరపురం, ఆదివారం మండపేట పట్టణంలోని నాయకులు, కార్యకర్తలు ఈ రిలే దీక్షలు చేస్తారని వివరించారు. సోమవారం ఉదయం 10 గంటలకు మండపేట పట్టణంలో పెద్ద ఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఆయా కార్యక్రమాలను ప్రజలతో కలసి విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పిలుపునిచ్చారు.

మధ్యవర్తిత్వంతో

కోర్టు కేసుల పరిష్కారం

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులను మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవడానికి ఇరు పక్షాలు, వారి తరఫు న్యాయవాదులు ముందుకు రావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునేద్‌ అహ్మద్‌ మౌలానా పిలుపునిచ్చారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యాన మీడియేషన్‌ 3.0 ప్రచార కార్యక్రమంలో భాగంగా నగరంలో బుధవారం నిర్వహించిన ర్యాలీ, వన్‌ కే వాక్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమైన కేసులపై మళ్లీ పైకోర్టుకు అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉండదని, దీంతో వివాదం శాశ్వతంగా పరిష్కారమవుతుందని వివరించారు. సివిల్‌ కోర్టుల్లో రాజీ కుదిరిన కేసుల్లో కోర్టు ఫీజు తిరిగి పొందే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. గతంలో ఇరు పక్షాలు రాజీకి వచ్చినప్పుడు కేసులను లోక్‌ అదాలత్‌కు మాత్రమే పంపేవారని, ప్రస్తుతం కక్షిదారులు, న్యాయవాదులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడానికి ఆసక్తి చూపడం శుభపరిణామమని మౌలానా అన్నారు. కార్యక్రమంలో మొదటి అదనపు సివిల్‌ జడ్జి కె.రత్నప్రసాద్‌, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సీహెచ్‌వీ ప్రసాద్‌, లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సభ్యులు, న్యాయవాదులు, శిక్షణ పొందిన మీడియేటర్లు, పారా లీగల్‌ వలంటీర్లు పాల్గొన్నారు.

12న రేషన్‌ బియ్యం వేలం

రాజమహేంద్రవరం రూరల్‌: జిల్లాలో నిత్యావసర వస్తువుల చట్టం కింద నమోదైన 6ఏ కేసులలో స్వాధీనం చేసుకున్న 776.97 క్వింటాళ్ల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) బియ్యానికి ఈ నెల 12న వేలం వేయనున్నారు. జాయింట్‌ కలెక్టర్‌ వై.మేఘాస్వరూప్‌ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్‌లో ఈ వేలం జరుగుతుందన్నారు. పాల్గొనదలచిన వారు ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల్లోగా రూ.లక్ష ధరావత్తును జిల్లా పౌర సరఫరాల అధికారి పేరిట చెల్లించి, దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.

ఎల్‌ఐసీ ప్రైవేటీకరణకే ప్రభుత్వ వాటాల తగ్గింపు

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా ఎల్‌ఐసీలో ప్రభుత్వ వాటాలను మరింత తగ్గించుకోవాలనే నిర్ణయం ప్రజలకు మేలు చేయదని ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఐసీఈయూ) ప్రధాన కార్యదర్శి ఎం.కోదండరామ్‌ అన్నారు. ఇది అంతిమంగా ప్రైవేటీకరణకే దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్‌ఐసీలో ప్రభుత్వ వాటా మరింతగా ఉపసంహరించాలనే నిర్ణయా న్ని వ్యతిరేకిస్తూ రాజమహేంద్రవరంలోని ఆ సంస్థ డివిజనల్‌ కార్యాలయం వద్ద ఐసీఈయూ ఆధ్వర్యాన ఉద్యోగులు బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ మాట్లాడుతూ, పెయిడ్‌–అప్‌ ఈక్విటీలో 2.5 శాతం ప్రాథమిక విక్రయం, అదనంగా 4 శాతం గ్రీన్‌–షూ ఆప్షన్‌ (అదనపు వాటాల విక్రయ వెసులుబాటు) ఉన్నాయని వివరించారు. దీనివలన మొత్తం పెట్టుబడుల ఉపసంహరణ 6.5 శాతానికి చేరుతుందని చెప్పారు. ఎల్‌ఐసీ, ప్రభుత్వ రంగ పరిరక్షణకు ప్రజాస్వామిక శక్తులు, కార్మిక సంఘాలు, పాలసీదారులు, ప్రజలు ఏకం కావాలని కోదండరామ్‌ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి కేఎస్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement