సాక్షి, అమలాపురం: గోదావరి వరదలతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వాటిపైనా రీల్స్ తీసి షేర్లు, లైకుల కోసం అర్రులు చాస్తున్నారు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు. వరద నీటిలో ప్రయాణాలు, ముంపులో చిక్కుకున్న రహదారులు, పడవలపై ప్రయాణాలు, ప్రవాహంలో పులస చేపల వేట వంటి దృశ్యాలను చిత్రీకరించి ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగాం, ఎక్స్‌లలో రీల్స్‌గా పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాను ముంచెత్తుతున్నారు.
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడం.. తద్వారా గోదావరికి వరద నీరు రాలేదు. కానీ ఎగువన కురిసిన వర్షాలతో గోదావరికి అకస్మాత్తుగా వరద పోటెత్తింది. దీంతో లంక గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. అదే సమయంలో డ్రోన్లు, సెల్‌ఫోన్లు, కెమెరాలతో గోదావరి ముంపు, పడవ ప్రయాణాలు, స్థానికుల కష్టాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు ఇన్‌ఫ్లుయెన్సర్లు. తమ కష్టాలు వారికి కంటెంట్‌గా తయారైందని కొందరు వాపోతుంటే.. తమ కష్టం వారికి కాసులు తెచ్చిపెడుతోందిలే అని నిర్వేదం వ్యక్తం చేసేవారు కొందరు. కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు ప్రమాదకర పరిస్థితులకు సైతం వెరవక అక్కడి పరిస్థితులను షూట్ చేస్తూ సాహసాలు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. సాహసం పేరుతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అటు ముంపు.. ఇటు లొల్ల అందాలు..
ఆత్రేయపురం మండలం లొల్ల సమీపంలో వర్షాల వల్ల వరి చేలు పెద్ద ఎత్తున మునిగిపోయిన విషయం తెలిసిందే. వీటిని కూడా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు వదలలేదు. కేరళ రాష్ట్రంలోని అలప్పి తరహాలో అందాలపై పోటీపడి రీల్స్ చేస్తున్నారు. వీటికి తెలుగు, మలయాళంలోని పాపులర్ పాటలను బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టడం గమనార్హం.
పులసకు సైతం కొత్త బ్రాండ్
గోదావరికి ఎర్ర నీరు తగలగానే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మాంసాహారులకు పులస చేప గుర్తుకు వస్తుంది. ఇటీవల పులస చేపల రాక తగ్గిపోయినా ఒడిషా, బెంగాల్ నుంచి వచ్చే విలాస హిల్సా చేపలను కూడా ఇన్‌ఫ్లుయెన్సర్లు వదలడం లేదు. పులస చేప కథలు, వంటకం విధానం, రుచుల వర్ణన, యానాం మార్కెట్‌లో వేలం పాటలు, రావులపాలెంలో పులస కూర ఆన్‌లైన్ విక్రయాలు ఇలా గోదావరి వరద కొందరికి వరదాయినిగా మారిందని చెప్పకతప్పదు.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు
ఉపాధిగా మారిన గోదారి ముంపు
రీల్స్ రూపంలో పోస్టుల వెల్లువ
ఒకరి దుఃఖం.. మరొకరికి లాభం!
కోనసీమలో నయా ట్రెండ్


