బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): పుష్కరాలకు వచ్చే భక్తులు ప్రశాంతమైన, ఆధ్యాత్మిక అనుభూతి పొందేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన బుధవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 16 శాఖలకు సంబంధించి 278 పనులను రూ.49.92 కోట్లతో ప్రతిపాదించగా ఇప్పటి వరకు దేవదాయశాఖకు సంబంధించి 15 పనులకు రూ.2.12 కోట్లు మంజూరైనట్టు తెలిపారు. గోదావరి పవిత్రతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఘాట్‌ల వద్ద పరిశుభ్రత, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
విద్యార్థుల హాజరుపై దృష్టిపెట్టాలి
పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుపై ప్రత్యేక నిఘా ఉంచాలని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన నాణ్యతను మెరుగుపరచాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత శాతాన్ని సాధించి జిల్లాను రాష్ట్రంలో ముందంజలో నిలపాలని ఆదేశించారు. బడి ఈడు పిల్లలు పాఠశాలల్లోనే ఉండేలా శ్రద్ధ చూపాలన్నారు. ప్రతి రోజూ సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య స్లిప్ టెస్టులు నిర్వహించి వారి పురోగతిని బేరీజు వేయాలని సూచించారు.
జిల్లాకు 4 బయోగ్యాస్ ప్రాజెక్టులు
గ్రామీణ ప్రాంతాల్లో పశువుల పేడ, వ్యవసాయ, వంటశాల (కిచెన్) వ్యర్థాలను సద్వినియోగం చేసుకుంటూ జిల్లాలో నాలుగు బయోగ్యాస్ ప్రాజెక్టులను ప్రతిపాదించినట్టు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ వెల్లడించారు. బుధవారం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, మున్సిపల్, దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులతో ఈ ప్రాజెక్టులపై వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు.
కలెక్టర్ హరేంధిరప్రసాద్


