సత్యగిరిపై ఇదేం కిరికిరి? | - | Sakshi
Sakshi News home page

సత్యగిరిపై ఇదేం కిరికిరి?

Aug 4 2026 12:11 AM | Updated on Aug 4 2026 12:11 AM

అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి సంబంధించి సత్యగిరి కొండ భూమి అంతా దేవస్థానం ఆధీనంలోనే ఉందా లేక అక్కడక్కడ ఆక్రమించారా అనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం గిరి ప్రదక్షిణ మార్గంలో పంపా ఘాట్‌ సమీపాన కొందరు దర్జాగా కొండపోడు చేసి మామిడి మొక్కలు నాటిన విషయం తెలిసిందే. అయితే ఆ కొండపోడు స్థలం దేవస్థానానిదేనని సోమవారం రెవెన్యూ అధికారుల సర్వేలో తేలింది. ఇది రోడ్డు పక్కనే కనుక కొద్ది రోజుల తరువాత అయినా అధికారులు తెలుసుకోగలిగారు. కానీ కొండ మీద జరిగుంటే తెలిసేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

303 ఎకరాలు దేవస్థానంలోనే ఉన్నాయా..

1998లో రెవెన్యూ విభాగం నుంచి కొనుగోలు చేసిన 303.88 ఎకరాల సత్యగిరికొండ అంతా దేవస్థానం అధీనంలోనే ఉందా? లేక ఆక్రమణలోనే ఉందా? రైతుల పేరుతో ఎవరైనా ఆక్రమించారా? 1998లో నిర్ణయించిన సరిహద్దులు అలాగే ఉన్నాయా లేక మధ్యలో ఎవరైనా మార్పు చేశారా? దేవస్థానం అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో ఆక్రమణదారులకు అవకాశంగా మారిందా? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్నాయి. సత్యదేవుడు వెలసిన రత్నగిరి కొండపై దేవస్థానం వివిధ నిర్మాణాలు చేపట్టడంతో సత్రాలు కట్టడానికి ఎక్కడా స్థలం లేని పరిస్థితి. దీంతో 1998లో అన్నవరం దేవస్థానం వివిధ నిర్మాణాల కోసం రత్నగిరి కొండను ఆనుకుని ఉన్న తొండంగి మండలం బెండపూడి పరిధిలోని సత్యగిరి కొండపై 303.70 ఎకరాలను కొనుగోలు చేసింది. ఆ కొండపై 139 గదుల హరిహరసదన్‌, 138 గదుల శివసదన్‌ సత్రాలు, పది ఎకరాల్లో స్మార్త, ఆగమ పాఠశాల, మరో రెండెకరాల్లో 36 మ్యారేజీ హాల్స్‌ కలిగిన విష్ణుసదన్‌ నిర్మించారు. అదే విధంగా రెండు ఎకరాల స్థలంలో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. మిగిలిన కొండ ఖాళీగా ఉండగా దాని చుట్టూ సరిహద్దుగా స్తంభాలు పాతి రాళ్లతో గోడ కట్టారు. అయితే ఆ గోడను పడగొట్టి కొండను ఆక్రమించి పోడు వ్యవసాయం చేస్తున్నారు.

గిరి ప్రదక్షిణ రోడ్డును ఆనుకుని తవ్వకాలు

ఇటీవల గిరిప్రదక్షిణ రోడ్డును ఆనుకుని ఉన్న కొండను పోలవరం అధికారులు తవ్వుతుండగా సత్యగిరి తవ్వేస్తున్నారని కొంతమంది యూట్యూబర్లు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే అది దేవస్థానం సరిహద్దుకు దిగువన ఉన్న స్థలమని అధికారులు తెలిపారు. కాగా, తాజాగా పోడు వ్యవసాయం పేరుతో చదును చేసిన స్థలం దేవస్థానానిదేనని సర్వేలో నిర్ధారణ అయింది. అయితే ఒక చోట ఉన్న స్థలం దేవస్థానానిది కాకపోవడం, వేరోచోట అదే సరిహద్దుగా ఉన్న స్థలం దేవస్థానానిది అని సర్వేలో తేలడంతో అంతా గందరగోళం నెలకొంది. పూర్తి సర్వేతోనే ఈ గందరగోళానికి తెరపడే అవకాశం ఉంది.

భూమికి హద్దూ.. ఆక్రమణకు అదుపు లేదు

అన్నవరం దేవస్థానం భూమిపై విచిత్ర పరిస్థితి

డీ పట్టా కాదు...ఆ ‘పోడు’ భూమి దేవస్థానానిదేనని సర్వేలో వెల్లడి

భూమిలో ఆక్రమణదారుడు ఏర్పాటు చేసిన డ్రమ్ముల స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement