● గోదావరిలో దిగితే మృత్యువును కోరుకున్నట్లే
● అధికారుల నిఘా ఉన్నా తప్పని ప్రమాదాలు
ఆలమూరు: గౌతమి గోదావరికి వరద వచ్చిందంటే చాలు గౌతమీ నది పరీవాహక ప్రాంతాల వెంబడి ప్రాంతాల్లో అధికంగా పుల్లల వేట జరుగుతూంటుంది. ఈ క్రమంలో ఎందరో యువకులు గోదావరిలో పుల్లలు సేకరించి అమ్ముకోవాలనే మోజులో ప్రాణాల్ని సైతం లెక్కచేయక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినా ఏటా అక్కడక్కడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తీర ప్రాంత గ్రామాల్లో వరద ఉధృతి సమయంలో ‘పుల్లల వేట వద్దు–ప్రాణాలే ముద్దు’ అంటూ ప్రచారం చేస్తున్నా పూర్తి స్థాయిలో పుల్లలవేట మాత్రం అదుపు కావడం లేదు. ఉమ్మడి తూర్పుగోదావరిలోని మూడు జిల్లాలోని వివిధ మండలాల్లోని అనేక గ్రామాల్లో గోదావరి ప్రవహిస్తుంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గౌతమి, వశిష్ట పాయలు విడిపోయి ఉధృతంగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తాయి. ఈ పరిస్థితుల్లో గోదావరి ఎగువ ప్రాంతాల నుంచి కొట్టుకువచ్చే కలప దుంగలు, పుల్లల కోసం వరదల సమయంలో వేట జరుగుతూ ఉంటుంది.
కొందరికి జీవనోపాధి
గోదావరిలో ఏటా లభ్యమయ్యే కలప సేకరణ ఇప్పటికీ కొందరికి జీవనోపాధిగా ఉంది. నదీ పరీవాహక ప్రాంత వాసులు గోదావరికి వరద వస్తుందంటే పుల్లలు, కలపపైనే ఆధారపడుతూ ఉంటారు. అయితే పుల్లలవేట ప్రమాదకరమని తెలిసినా కొన్నిచోట్ల పడవలు వేసుకువెళ్లడం గాని, ఈత కొట్టుకుని వెళ్లి కలపను సేకరించడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ఒక్కోసారి అదుపుతప్పి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు ఉన్నాయి. అయితే గత కొన్నేళ్లుగా అధికారుల ప్రత్యేక నిఘా ఎక్కువగా ఏర్పాటు చేయడంతో పుల్లల వేట పూర్తిగా తగ్గినా ఇంకా అనేక చోట్ల కొనసాగుతుంది.
అవగాహనతోనే నియంత్రణ
జిల్లాలో నదీ పరీవాహక మండలాల్లోని అనేక గ్రామాల్లో గత రెండు దశాబ్దాలుగా అనేక మంది మంది మృత్యువాత పడ్డారు. అయితే ఈప్రమాదాలపై కొన్ని కేసులు నమోదవుతున్నాయి. అనేక మంది ఆచూకీ లేకుండా పోతుంది. మరికొన్ని సందర్భాల్లో పోలీసుల దృష్టికి రావడం లేదు. అయినా ఇంత ప్రాణనష్టం జరిగినా పుల్లల వేటను వదిలేసేందుకు తీర ప్రాంతవాసులు అంగీకరించకపోవడం పరిస్థితికి అద్దం పడుతుంది. పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు ప్రమాదం జరిగినప్పుడే అధికారులు స్పందించే కన్నా ఏటా వరదల సమయంలో పుల్లల వేట అనర్థాలపై ప్రజలను చైతన్యవంతం చేస్తే మంచి ఫలితం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.


