పిఠాపురం: ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకం. ఆ హక్కు రావాలంటే 18 ఏళ్లు నిండాలి. అందుకోసం ఇప్పటి వరకు ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతి కోసం యువత వేచి చూడాల్సి వచ్చేది. తాజా నిబంధనల ప్రకారం 17 ఏళ్లు నిండగానే వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది ఈసీ. ముందుగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ 18 ఏళ్లు పూర్తిగా నిండిన తరువాతే తుది ఓటరు జాబితాలో పేరు నమోదవుతుంది.
ఏడాదిలో నాలుగు సార్లు అవకాశం
యువత ఓటర్లుగా నమోదయ్యేందుకు ఈసీ ఏడాదికి నాలుగు తేదీల్లో మాత్రమే వీలు కల్పించింది. ఆ మేరకు జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీల్లో ఫారం 6 ద్వారా ముందస్తుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
కొత్త నిబంధనలు ఇలా
17 ఏళ్లు నిండిన యువత తమ వయస్సు, నివాస ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని బీఎల్‌ఓలు పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటే 18 ఏళ్ల తరువాత ఓటు హక్కు కల్పిస్తారు. ఈ మేరకు జిల్లాలోని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహించేలా కసరత్తు చేస్తున్నారు. దీనివల్ల ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
యువ ఓటర్లు పెరిగే అవకాశం
ఈసీ తాజా నిర్ణయంతో జిల్లాలో సుమారు 29 వేల మందికి పైగా యువతకు ఓటు హక్కు లభించనుంది. జిల్లాలో 2023–24 పదో తరగతి విద్యార్థులు 27,600 మంది, ఇందులో బాలురు 13,100 మంది, బాలికలు 14,500 మంది, మధ్యలో చదువు మానేసిన వారు (8, 9 తరగతులు), ఇతరులు 3,500 మంది మొత్తం 30 వేలకు పైగా విద్యార్థులున్నట్లు ఉన్నట్లు అంచనా. 2023–24 విద్యాసంస్థల్లో పరీక్షలు రాసే సమయానికి 15 ఏళ్లు నిండిన విద్యార్థుల వయస్సు 2026 నాటికి 17 ఏళ్లకు చేరుకుంటుంది. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం, డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న వేలాది విద్యార్థులు నేడు 17–18 ఏళ్ల గ్రూపులోకి వస్తున్నారు. వారితో పాటు ఇతర వృత్తి వ్యాపకాల్లో ఉన్నవారు సుమారు 10 వేల మంది ఉంటారని అంచనా. స్థూలంగా జిల్లాలో సుమారు 40 వేల మందికి ఓటు హక్కు లభించే అవకాశం ఉంది.
17 ఏళ్లకే ఓటు హక్కుకు
దరఖాస్తు చేసుకునే అవకాశం
ఏడాదికి నాలుగు తేదీలు
ప్రకటించిన ఎన్నికల సంఘం
జిల్లాలో 40 వేల వరకూ
పెరగనున్న యువ ఓటర్లు


