● అన్నదాతలపై చంద్రబాబు
సర్కారు చిన్నచూపు
● పంటల బీమా చెల్లించాల్సిందేనని హుకుం
● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో
ఉచితంగా అమలు
పంట సాగు చేస్తున్న రైతులు
రాయవరం: రైతు ప్రభుత్వమని చెబుతూనే, నడ్డివిరిస్తోంది.. పచ్చని సిరులు పండించే రైతులను నట్టేట ముంచుతోంది.. ఒకపక్క ప్రకృతి వైపరీత్యాలు కుంగదీస్తుంటే, మరోపక్క పంటల బీమా భారాన్ని మోపుతోంది. అన్నదాతలకు ఆపద కాలంలో అండగా నిలిచే, పంటల బీమా పథకం ప్రస్తుతం భారంగా మార్చేసింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అమలైన ఉచిత పంటల బీమా విధానానికి చంద్రబాబు సర్కారు స్వస్తి పలికింది. ప్రస్తుతం రైతులే బీమా ప్రీమియం చెల్లించాలని ఆదేశించడంతో జిల్లాలోని రైతుల్లో కలవరం మొదలైంది.
తూర్పుగోదావరి జిల్లాలో 41,740,885 ఎకరాలకు పంటల బీమా చేయించాలన్నది వ్యవసాయ శాఖ లక్ష్యం. అయితే ఈ నెల 1వ తేదీ నాటికి 13.64 శాతం మాత్రమే పంటల బీమా పూర్తయ్యింది. అలాగే 4,786 ఎకరాల విస్తీర్ణంలో సాగయ్యే అరటిని పంటల బీమా పథకం కిందకు తీసుకు రావాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 54.977919 ఎకరాలను (1.2 శాతం) పంటల బీమా కింద నమోదు చేయించుకున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో పంటల బీమా ప్రీమియం చెల్లించేందుకు ఈ నెల 15 వరకు గడువు ఉంది. బ్యాంకు నుంచి పంటపై రుణం తీసుకోని రైతులు ఎకరాకు రూ.570 ప్రీమియం చెల్లించాలి.
సర్వర్ సమస్యతో సతమతం
పంటల బీమా పథకంలో ప్రీమియం చెల్లించాలనుకునే రైతులకు ఒకపక్క ఆర్థిక భారం ఉంటే, మరోపక్క సర్వర్ సమస్య తోడైంది. పంటల బీమా పథకాన్ని వినియోగించుకోవాలనే రైతులకు ఆన్‌లైన్‌లో సర్వర్ సమస్య వెంటాడుతోంది. ప్రతి రైతు మీ సేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ)లో బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని వెళ్లి తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో ముందుగా రైతు వివరాల నమోదు వేగంగా తీసుకున్నా.. క్రాప్ వివరాలు, సర్వే నంబరు ఎంటర్ చేసిన తర్వాత సర్వర్ సమస్య వస్తోంది. అక్కడి నుంచి దరఖాస్తు ముందుకు సాగడం లేదు. దీంతో రైతులు అధిక సమయం వెచ్చించలేక కూడా వెనకంజ వేస్తున్నారు.
గతమెంతో ఘనం
రైతు శ్రేయస్సే ధ్యేయంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సాగింది. జిల్లాలో సాగు చేసే రైతుల తరఫున బీమా ప్రీమియం మొత్తం చెల్లించింది. దీంతో రైతులు మీసేవా కేంద్రాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పని తప్పింది. బీమాను రైతుల తరఫున జగనన్న ప్రభుత్వమే చెల్లించడంతో ప్రకృతి వైపరీత్యాల సమయంలో పరిహారం సకాలంలో అందేది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్లలో రైతులు ఒక్క రూపాయి బీమా పొందిన దాఖలాలు లేవు. గతేడాది ఖరీఫ్ ముగిసే సమయంలో అక్టోబర్ నెలలో వచ్చిన మోంథా తుపాన్ కారణంగా పంట నష్టం జరిగినా, పంటల బీమా సక్రమంగా అమలు కాక రైతులు ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో ప్రభుత్వం నుంచి పంట నష్ట పరిహారం ఏ ఒక్క రైతుకూ చెల్లించలేదు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం పంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించాల్సి రావడంతో ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇబ్బందిగా మారింది
ఎరువులు, విత్తనాల ధరలు పెరిగాయి. ఇప్పుడు పంటల బీమా ప్రీమియం కూడా రైతులే కట్టాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. మీ సేవా కేంద్రాలకు వెళ్లి చెల్లించాలంటే ఎంత మంది వెళ్లి చెల్లిస్తారు. పంట నష్టపోతే ఆదుకునే బీమా కోసం కూడా రైతులే డబ్బులు చెల్లించాల్సి రావడం భారంగా మారింది.
– చేవా సత్యనారాయణ, రైతు,
లొల్ల, రాయవరం మండలం
చెప్పిందొకటి.. చేస్తున్నదొకటి
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిందొకటి, ఇప్పు డు చేస్తుందొకటి. రైతులు మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగలే క పంటల బీమా ప్రీమియం చెల్లించడం లేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతుకు ఎటువంటి కష్టం లేకుండా పూర్తి ప్రీమియం ఉచితంగా చెల్లించింది. ఆ ప్రయోజనాలు రైతులు పొందారు.
– సబ్బెళ్ల కృష్ణారెడ్డి,
వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి, అనపర్తి


