బెధరగొట్టేలా.. | - | Sakshi
Sakshi News home page

బెధరగొట్టేలా..

Aug 3 2026 12:19 AM | Updated on Aug 3 2026 12:19 AM

ఒడిదొడుకుల్లో వర్జీనియా

పొగాకు మార్కెట్‌

రైతులకు గిట్టుబాటు కాని ధర

లో గ్రేడ్‌కు ఆసక్తి చూపని ట్రేడర్లు

రూ.10 పెంచి రూ.30 కోత

దేవరపల్లి: పొగాకు కొనుగోళ్లు ఒడిదొడుకుల్లోనే సాగుతోంది.. నాలుగు నెలలుగా ధరలో ఎటువంటి పురోగతి లేకపోయింది. ఈ ధరకు అమ్మాలా.. వద్దా అనే సందిగ్ధం రైతుల్లోనెలకొంది. జూలై నెలాఖరులో ధరలు పెరుగుతాయని అంతా ఆశించారు. ఆ ఆశలకు ట్రేడర్లు పొగ పెట్టారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది కిలో రూ. 265 ధరతో కొనుగోళ్లు ప్రారంభం కాగా, మొన్నటి వరకు ఇదే ధర కొనసాగింది. ఈ ధర బ్రైట్‌ పొగాకుకు మాత్రమే పలకగా, లో గ్రేడు (ఎక్స్‌) పొగాకుకు రూ. 160 వచ్చింది. ఎక్కువ శాతం పొగాకు తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో గిట్టుబాటు కాక రైతులు దిగాలు పడ్డారు.

పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్‌ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. దాదాపు 110 రోజులు కొనుగోళ్లు జరగ్గా, ఇప్పటి వరకు కేవలం 10.73 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. పండించిన పంటలో కనీసం 10 శాతం కూడా కొనకపోవడంతో రైతుల ఇళ్ల వద్ద ఎక్కడ పొగాకు అక్కడే ఉంది. ఏటా ఈ సమయానికి సుమారు 80 శాతం కొనుగోళ్లు జరిగేవి. గత ఏడాది 210 రోజుల్లో పొగాకు కొనుగోళ్లు పూర్తి కాగా, ఈ ఏడాది జనవరి వరకు కొనసాగుతుందని అధికారులు అంటున్నారు. కొనుగోళ్లు ఆలస్యమైతే పొగాకు రంగు, నాణ్యత దెబ్బతింటుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే పొగాకు నాణ్యత దెబ్బతిన్నట్టు చెబుతున్నారు. ఈ నెల 15 నుంచి 2026–27 పంట సీజన్‌ ప్రారంభం కానుంది. దీంతో గత పంట సీజన్‌లో పండించిన పొగాకు అమ్మకాలు పూర్తి కాకుండానే, కొత్త పంట మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

కోలుకోవడం కష్టం

పొగాకు ధర లేక రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కిలో గరిష్ఠ ధర రూ. 453 పలకగా, ఈ ఏడాది రూ. 275 పలకడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. సగటు ధర రూ. 170 పలుకుతుంది. ఈ ధర ఎంత మాత్రం గిట్టుబాటు కాదని రైతులు అంటున్నారు. ఉత్పత్తి వ్యయంతో పాటు భూముల కౌలు, బ్యారన్ల అద్దె, పెట్టుబడి పెరగడంతో కిలోకు సగటు ధర రూ. 350 ఇవ్వకపోతే కోలుకోవడం కష్టమని చెబుతున్నారు.

10.73 మిలియన్ల కిలోల విక్రయాలు

రీజియన్‌ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో ఇప్పటి వరకు రూ. 257.74 కోట్ల విలువైన 10.73 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. దేవరపల్లి వేలం కేంద్రంలో 1.56 మిలియన్ల కిలోలు, జంగారెడ్డిగూడెం–1 వేలం కేంద్రంలో 2.33 మిలియన్ల కిలోలు, జంగారెడ్డిగూడెం–2 కేంద్రంలో 2.48 మిలియన్ల కిలోలు, కొయ్యలగూడెం వేలం కేంద్రంలో 2.20 మిలియన్ల కిలోలు, గోపాలపురం వేలం కేంద్రంలో 2.15 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. కిలో గరిష్ఠ ధర రూ. 275, కనిష్ఠ ధర రూ. 161, సగటు ధర రూ. 243.43 లభించింది.

దేవరపల్లి వేలం కేంద్రంలో రైతులు అమ్మకానికి తీసుకు వచ్చిన పొగాకు బేళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement