సరైన సన్నద్ధత లేక.. | - | Sakshi
Sakshi News home page

సరైన సన్నద్ధత లేక..

Aug 3 2026 12:19 AM | Updated on Aug 3 2026 12:19 AM

ఆన్సర్‌ బుక్‌లెట్స్‌ సరఫరాలో జాప్యం

ఎస్‌ఏ–1 పరీక్షలు వాయిదా

తిరిగి 17 నిర్వహిస్తామని ప్రకటన

రాయవరం: పరీక్షలు అన్నారు.. ఆన్సర్‌ బుక్‌లెట్స్‌ (జవాబు పత్రాల పుస్తకాలు) సరఫరాలో జాప్యం చేశారు.. దీనివల్ల చివరికి పరీక్షలను వాయిదా వేశారు.. సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌–1 పరీక్షల నిర్వహణకు సరైన సన్నద్ధత లేకపోవడంపై అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌–1 పరీక్షలు జరగాల్సి ఉంది. వివిధ కారణాలతో ఈ పరీక్షలను 17వ తేదీకి వాయిదా వేశారు. విద్యార్థి అభ్యసనాన్ని మదింపు చేసేందుకు విద్యాశాఖ ప్రతి ఏటా నాలుగు సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు, రెండు సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది కొత్త విద్యా సంవత్సరం జూన్‌ 12వ తేదీ నుంచి ప్రారంభమైంది. 2026–27 విద్యా సంవత్సరంలో ఈ పరీక్షలను ముందుగా పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించాలి. గత విద్యా సంవత్సరం నుంచి పరీక్షలను విద్యార్థులు విధిగా అసెస్‌మెంట్‌ పుస్తకాల్లోనే రాస్తున్నారు. విద్యార్థులకు ఆన్సర్‌ బుక్‌లెట్స్‌ జిల్లాకు చేరుకోవడం ఆలస్యం కావడంతో ఈ పరీక్షలను ఈ నెల 17కు వాయిదా వేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ యాజమాన్యాల పరిధిలోని 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌–1 పరీక్షలు 17 నుంచి నిర్వహిస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. గత విద్యా సంవత్సరంలో కూడా ఆగస్టు 3వ తేదీ నుంచి జరగాల్సిన పరీక్షలను 11వ తేదీకి వాయిదా వేశారు. ఇప్పుడు సవరించిన షెడ్యూల్‌ మేరకు ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 5 నుంచి 16వ తేదీ వరకు ఇన్‌ సర్వీస్‌ టీచర్లు ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌–1 పరీక్షలను వాయిదా వేసి ఈ నెల 16వ తేదీ తర్వాత నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రభుత్వ పాఠశాల కమిషనర్‌ దృష్టికి తీసుకు వెళ్లడంతో వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

మారిన షెడ్యూల్‌ ఇలా..

పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వేర్వేరుగా పరీక్షల నిర్వహణకు తాజాగా షెడ్యూల్‌ ప్రకటించారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం 1–5 తరగతుల విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి 10.45 గంటల వరకు, మధ్యాహ్నం 1.15 నుంచి 2.30 గంటల వరకు నిర్వహిస్తారు. 17న తెలుగు, గణితం, 18న ఇంగ్లిషు, పరిసరాల విజ్ఞానం, 19న ఓఎస్‌ఎస్‌సీ పరీక్షలు నిర్వహిస్తారు. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 వరకు, మధ్యాహ్నం 2.45 నుంచి 4 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. వీరికి 17న తెలుగు, గణితం, 18న హిందీ, జనరల్‌ సైన్స్‌, ఫిజికల్‌ సైన్స్‌, 19న ఇంగ్లిషు, సోషల్‌, 20న 8 నుంచి 10 తరగతులకు బయలాజికల్‌ సైన్స్‌, ఓఎస్‌ఎస్‌సీ, 6, 7 తరగతులకు ఓఎస్‌ఎస్‌సీ, 8, 9, 10 తరగతులకు ఓఎస్‌ఎస్‌సీ–2 పరీక్ష నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement