రాజమహేంద్రవరం సిటీ: గోదావరి పుష్కరాల నేపథ్యంలో చేపడుతున్న రివర్ ఫ్రంట్ పనులను వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ఆదివారం తనిఖీ చేశారు. స్థానిక మార్కండేయ స్వామి గుడి సమీపంలో గోదావరి వద్ద రివర్ ఫ్రంట్ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఇసుక బస్తాలు ఎందుకు వేశారని కార్పొరేషన్ ఈఈ అలీని ప్రశ్నించారు. పనులు నాణ్యతా ప్రమాణాలతో చేస్తున్నప్పుడు ఇసుక బస్తాలు వేసి ఎందుకు అడ్డుకట్ట వేశారని అడిగి తెలుసుకున్నారు. గోదావరి గట్టు లోపలకు తవ్వి పనులు చేస్తున్నప్పుడు ఇసుక బస్తాలు వేయాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. దీనిపై ఈఈ మాట్లాడుతూ గోదావరికి వరద అధికంగా వస్తున్న నేపథ్యంలో పనుల నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఇసుక బస్తాలు వేశామని వివరించారు. అనంతరం అక్కడి నుంచి ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి గోదావరి వరద ప్రవాహం, ప్రమాద హెచ్చరికల జారీ, తీసుకుంటున్న జాగ్రత్తలు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తుగానే సూచనలు ఇచ్చి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుర్రం గౌతం, మార్గాని సురేష్, మదీనా బాషా తదితరులు ఉన్నారు.
నాణ్యమైన బియ్యం
విక్రయాలకు చర్యలు
సీటీఆర్‌ఐ: జిల్లాలోని ఎనిమిది రైతు బజార్లు, 33 రైస్‌మిల్లుల అవుట్‌లెట్ల ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు సూపర్ ఫైన్/స్టీమ్ బియ్యం కిలో రూ.52కు, రా రైస్ కిలో రూ.50కు విక్రయించేందుకు చర్యలు చేపట్టినట్లు జేసీ వై.మేఘా స్వరూప్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని గణేష్‌చౌక్, ఆర్ట్స్ కాలేజీ, క్వారీ మార్కెట్, వీఎల్ పురం, నటరాజ్ థియేటర్, లాలాచెరువు, శంభూనగర్ రైతు బజార్లలో బియ్యం విక్రయాలు జరుగుతాయన్నారు. అదే విధంగా జిల్లాలోని 33 రైస్‌మిల్లుల వద్ద అవుట్‌లెట్లు ఏర్పాటు చేసి బియ్యాన్ని అమ్మేందుకు చర్యలు చేపట్టామన్నారు.
కిక్కిరిసిన విఘ్నేశ్వర ఆలయం
అయినవిల్లి: విఘ్నేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారికి ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి విశేష పూజలు నిర్వహించారు. పంచామృత, లఘున్యాస అభిషేకాల్లో పలువురు భక్తులు పాల్గొన్నారు. ఇద్దరు గరిక పూజ, నలుగురు ఉండ్రాళ్ల పూజ, 61 మంది లక్ష్మీగణపతి హోమం నిర్వహించుకున్నారు. ఓ చిన్నారికి నామకరణం, ఒకరికి అన్నప్రాశన, తులాభారం నిర్వహించారు. నూతన వాహనాలకు పూజలు జరిపారు. అన్నప్రసాదం 2,885 మంది భక్తులు స్వీకరించారు. అన్నప్రసాద విరాళాలు, ప్రసాదాలు, పూజా టికెట్ల విక్రయం ద్వారా రూ.3,74,580 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ, సహాయ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.


