ఉగ్ర గోదావరి | - | Sakshi
Sakshi News home page

ఉగ్ర గోదావరి

Aug 2 2026 12:16 AM | Updated on Aug 2 2026 12:16 AM

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద

ఉధృతంగా నీటి ప్రవాహం

పునరావాస కేంద్రాలకు బాధితుల

తరలింపు

నీట మునిగిన పంట పొలాలు

రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లోకి పర్యాటకులకు ప్రవేశం నిలిపివేత

సాక్షి, రాజమహేంద్రవరం: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో గోదావరి ఉరకలేస్తోంది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ప్రాణహిత, ఇంద్రావతి పొంగి ప్రవహిస్తుండడంతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ వద్ద వరద నీటి ప్రవాహం శనివారం ఉదయం నుంచి గంటగంటకూ పెరుగుతోంది. శనివారం రాత్రి 9 గంటల సమయానికి బ్యారేజీ వద్ద నీటి మట్టం 13.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్‌లోని వరద నీటిని ఎప్పటికప్పుడు ధవళేశ్వరం, ర్యాలీ, మద్దూరు, విజ్జేశ్వరం ఆర్ముల్లోని 175 గేట్ల ద్వారా కిందకు విడిచిపెడుతున్నారు.

పుష్కరఘాట్‌లోకి అనుమతి నిలిపివేత

● రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్లను తాకుతూ వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లోకి భక్తులు, పర్యాటకులకు అనుమతిని నిలిపేశారు. కోటిలింగాల ఘాట్‌, కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది.

● వరదల నేపథ్యంలో రాజమహేంద్రవరం అర్బన్‌ మండలంలోని ఏసీ గార్డెన్స్‌ మున్సిపల్‌ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి 90 కుటుంబాలకు చెందిన 210 మంది బాధితులను తరలించారు. ఆ కేంద్రాన్ని ఆర్డీవో ఆర్‌.శివరాముడు పరిశీలించారు.

● సీతానగరం మండలం బొబ్బిలిలంక–ములకల్లంక గ్రామాల మధ్య ప్రజల రాకపోకల కోసం ఏర్పాటు చేసిన పడవ సేవలను మళ్లీ ప్రారంభించారు.

● అత్యవసరమైతే సహాయ, పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు 26 మంది సభ్యుల ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం కమాండ్‌ ఆఫీసర్‌ ఇన్‌స్పెక్టర్‌ దీపక్‌ ఆధ్వర్యంలో విజయవాడ నుంచి రాజమహేంద్రవరానికి చేరుకుంది.

● కపిలేశ్వరపురం మండలంలోని కేదారలంక (తొగరపుపాయ), ఏవీ లంక గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని ఆర్‌డీవో శివరాయుడు పరిశీలించారు.

ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజ్‌ వద్ద గోదావరి ఉధృతి

అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్‌

జిల్లా యంత్రాంగం వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని, లోతట్టు, నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ కీర్తి సూచించారు. అవసరం లేని ప్రయాణాలు చేయవద్దని, నది వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రజలకు అవసరమైన సహాయక చర్యలకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement