ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెంచాలి

Aug 2 2026 12:16 AM | Updated on Aug 2 2026 12:16 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో ప్రసూతి మరణాలను నివారించేందుకు గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, హైరిస్క్‌ గర్భిణులను ముందుగానే గుర్తించి తగిన వైద్య సేవలు అందించాలని అధికారులను కలెక్టర్‌ కీర్తి ఆదేశించారు. కలెక్టరేట్‌లో వైద్య, ఆరోగ్య, ఐసీడీఎస్‌ శాఖలపై శనివారం నిర్వహించిన సమీక్షలో ఆమె ఈ మేరకు సూచనలు చేశారు. ప్రతి పీహెచ్‌సీ పరిధిలో ప్రసవానికి సమీపంలో ఉన్న గర్భిణుల పూర్తి వివరాలు సంబంధిత వైద్యాధికారుల వద్ద ఉండాలని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. జిల్లాలోని 38 పీహెచ్‌సీల్లో ప్రతి నెలా ఒక్కో కేంద్రంలో కనీసం పది ప్రసవాలు జరిగేలా లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలిపారు. ఏప్రిల్‌ నుంచి జూనలై వరకు 1,140 ప్రసవాలు లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 78 మాత్రమే జరిగినట్లు వెల్లడించారు. పౌష్టికాహార లోపం ఉన్న చిన్నారుల తల్లిదండ్రులకు సమతుల్య ఆహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పౌష్టికాహార పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ పి.కోమల, డీసీహెచ్‌ఎస్‌ ఎం.పద్మ, పీడీ ఐసీడీఎస్‌ టి.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

డీఎంఈ ఆకస్మిక తనిఖీ

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) తాళ్లూరి విష్ణువర్దన్‌ రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులను శనివారం తనిఖీ చేశారు. విజయవాడ నుంచి వచ్చిన ఆయన ముందుగా ప్రభుత్వాసుపత్రికి చేరుకుని అక్కడ ఓపీ విభాగాన్ని పరిశీలించారు. అక్కడ రద్దీగా ఉండడంతో అదనంగా కంప్యూటర్లు పెంచాలని సూచించారు. మహాప్రస్థానం డ్రైవర్లను డబ్బులు తీసుకోవద్దని హెచ్చరించారు. ఆసుపత్రి లోపల వార్డులను పరిశీలించారు. పలు వైద్య విభాగాలను, రోగులకు అందుతున్న సౌకర్యాలపై వైద్యాధికారులను వివరాలు అడిగారు. మాతా, శిశు విభాగాన్ని, మార్చురీని పరిశీలించారు. అనంతరం మెడికల్‌ కళాశాలకు వెళ్లారు. అక్కడ వైద్య విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.

5 నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్షలు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టెట్‌) ఈ నెల 5 నుంచి 16వ తేదీ వరకు రాజమహేంద్రవరంలోని అయాన్‌ డిజిటల్‌ జోన్‌లో జరుగుతాయని డీఈవో కె.వాసుదేవరావు తెలిపారు. ఆయన శనివారం మాట్లాడుతూ సెషన్‌ – 1లో ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, సెషన్‌ – 2లో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులందరూ వారి హాల్‌ టికెట్‌ వెనుక ఇచ్చిన సూచనలను అనుసరించి పరీక్షకు హాజరు కావాలన్నారు. ఈ పరీక్షలకు సుమారు 16,680 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని, పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్ష న్‌, పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

మెట్టలో భారీ వర్షం

దేవరపల్లి: మెట్ట ప్రాంతంలో శనివారం తెల్లవారుజాము 3 నుంచి 6 గంటల భారీ వర్షం కురిసింది. వర్షాలకు తడిలేక ఎండిపోతున్న వరి చేలు తెప్పరిల్లాయి. ఇతర పంటలు కోలుకున్నాయి. బాడవ భూముల్లోకి నీరు చేరడంతో వరినాట్లు వేస్తున్నారు. అయితే రోడ్లు మాత్రం పూర్తిగా బురదగా మారాయి. కొవ్వూరు డివిజన్‌లోని తొమ్మది మండలాల్లో 357.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. డివిజన్‌ సగటు వర్షపాతం 39.7 మిల్లీ మీటర్లుగా ఉంది. మండలాల వారీగా తాళ్లపూడిలో 54.4, గోపాలపురంలో 60.2, నల్లజర్లలో 53.4, దేవరపల్లిలో 54.4, కొవ్వూరులో 14.8, చాగల్లులో 57.2, నిడదవోలులో 42.0, ఉండ్రాజవరంలో 12.0, పెరవలిలో 8.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

మార్గదర్శకాలు పాటించాలి

రాజమహేంద్రవరం రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష–2026 నిర్వహణలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అధికారులు కచ్చితంగా అమలు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌.భాస్కర్‌ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్‌లో ఆయన అధ్యక్షతన పోలీసు, విద్యుత్‌, వైద్య, ఆర్టీసీ, విద్యాశాఖ తదితర విభాగాల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. విద్యుత్‌ సరఫరా, వైద్య సదుపాయాలు, రవాణా, భద్రత, పరీక్షా నిర్వహణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement