ప్రమాదం అంచున గోదావరి గట్టు | - | Sakshi
Sakshi News home page

ప్రమాదం అంచున గోదావరి గట్టు

Aug 2 2026 12:16 AM | Updated on Aug 2 2026 12:16 AM

వరద ఉధృతి పెరగడంతో ఇసుకబస్తాల ఏర్పాటు

రివర్‌ ఫ్రంట్‌ పనుల పేరిట గట్టుకు తూట్లు

వరదొస్తే ప్రమాదమని ముందే

హెచ్చరించిన ‘సాక్షి’

సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం నగరవాసులు భయపడుతున్నట్లే జరిగింది. రివర్‌ఫ్రంట్‌ పేరిట గోదావరి గట్టుకు తూట్లు పొడిచేయడంతో అక్కడ బలహీనంగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వరద ఉధృతి పెరగడంతో ఆ ప్రాంతంలో కోతకు గురవుతుండడంతో హడావుడిగా ఇసుక బస్తాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే వరద ఉధృతి మరింత పెరిగితే ఆ ఇసుక బస్తాలు రక్షణగా నిలుస్తాయా, రాజమహేంద్రవరం నగరం, నగరవాసులు సురక్షితమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే కొంత ప్రాంతం గోదావరిని ఆనుకుని రోడ్డు అంచు వరకూ మట్టి కోతకు గురైపోవడంతో నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నాడు అడ్డగోలుగా తవ్వేయడంతో...

అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా రాజమహేంద్రవరం శారదా మఠం ఎదురుగా పద్మావతి ఘాట్‌లో సుమారు రూ.24 కోట్లతో రివర్‌ ఫ్రంట్‌, ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా అప్పటికే అక్కడ ఉన్న ఘాట్‌ను తొలగించేశారు. పక్కనే ఉన్న పార్కును కలుపుతూ రివర్‌ఫ్రంట్‌ నిర్మించాలని అక్కడి ఘాట్‌ను పూర్తిగా తవ్వేశారు. అవసరమైన మేరకు కాకుండా రోడ్డువైపు కూడా చాలా వరకు తవ్వేయడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ గోదావరి నీరు మలుపు తిరిగే ప్రదేశం కావడంతో వరద ప్రవాహం పెరిగితే నీటి ఒత్తిడి కారణంగా ప్రమాదమని ఈ ఏడాది ఏప్రిల్‌లోనే నిపుణులు, ‘సాక్షి’ హెచ్చరించాయి. అప్పటి వరకూ గట్టుకు రక్షణగా నిలిచిన రివిట్‌మెంట్‌ను కూడా తవ్వేయడం తీవ్ర వివాదాస్పదమైంది. అక్కడ జలాలు చేరితే మట్టి జారిపోయే ప్రమాదముందని నాడు భావించినట్టే ప్రస్తుతం జరుగుతోంది. ప్రస్తుతం గోదావరి వరద ఉధృతికి ఓ చోట రోడ్డు అంచు వరకూ మట్టి జారిపోయింది. ఆ గట్టు మరింత కుంగితే... గోదావరి కట్టలు తెంచుకుని పక్కనే రోడ్డు, నివాస గుహాల్లోకి నీరు చేరే ప్రమాదముంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, సంబంధిత కాంట్రాక్టర్‌ నిర్లక్ష్య వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు చేపట్టాలని నగర వాసులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement