ఫ జాబ్‌మేళాకు విశేష స్పందన
ఫ మాజీ ఎంపీ భరత్‌రామ్
ఫ కార్యక్రమాన్ని ప్రారంభించిన
శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు
రాజమహేంద్రవరం సిటీ: నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడానికి ప్రత్యేక ప్రణాళికలతో కృషి చేస్తున్నట్టు వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో శనివారం రాజమహేంద్రవరంలోని మంజీరా కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ప్రారంభించారు. భరత్‌రామ్ మాట్లాడుతూ 70 కంపెనీలతో నిర్వహించిన ఈమేళాకు సుమారు 1500 మంది నిరుద్యోగ యువత తరలి వచ్చారన్నారు. జెన్‌జీ యువత ప్రాధాన్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయని, వారు రోడ్డెక్కితే ప్రభుత్వాలు గడగడలాడే పరిస్ధితులు వస్తాయన్న భయం నెలకొందన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ వల్ల చాలా నష్టం జరిగిందని, అదే తరహాలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో కూడా డీఎస్సీ పేరుతో అక్రమాలు, అవినీతి చేశారని ఆరోపించారు. గత ఐదేళ్లలో రాజమహేంద్రవరం నగరాన్ని జగనన్న సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని, కంబాల చెరువు పార్కు, గ్లో గార్డెన్, ఓపెన్ ఎయిర్ హ్యాపీ థియేటర్, హ్యాపీ స్ట్రీట్‌తో పాటు చాలా మార్పులు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు.
అభినందనీయం
కొయ్యే మోషేన్ రాజు మాట్లాడుతూ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో భరత్‌రామ్ మెగా జాబ్ మేళాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్లలో మోరంపూడి ఫ్లైఓవర్ సహా నగరం రూపు రేఖలు మార్చడానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. కాగా.. మేళాకు హాజరైన వారిలో 350 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారికి భరత్ రామ్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. మరో 450 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబితాను తయారు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావు, ప్రభుత్వ మాజీ విప్, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్‌చార్జి డాక్టర్ గుడూరి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు, ఏపీ గ్రీనింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, రాష్ట్ర కార్యదర్శి చందన నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


