కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లాలో గురువారం ఒకరికి కరోనా నిర్ధారణ అయింది. డీఎంహెచ్‌ఓ పి.కోమల వివరాలు వెల్లడిస్తూ రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో 17 మందికి కోవిడ్ నిర్ధారణకు రాగా పరీక్షల అనంతరం ఒకరికి వైరస్ సోకినట్టు తెలిపారు. దీంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 16కు చేరింది. కరోనా సోకిన వ్యక్తిని ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. అతని ఆరోగ్య పరిస్థితి కుదురుగానే ఉంది.
సిట్ కస్టడీకి సీఐ నాగరాజు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కాపు యువకుడు సాయికృష్ణ హత్య కేసులో నిందితుడు, విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజును సిట్ బృందం గురువారం కస్టడీకి తీసుకుంది. స్థానిక సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయను ఇక్కడ కాకుండా బయట విచారిస్తామన్న సిట్ వాదనతో ఏకీభవించిన కోర్టు ఆ మేరకు అనుమతించడంతో ఆయనను విజయవాడలో విచారించవచ్చని తీర్పు ఇచ్చింది. ఈ మేరకు గురువారం ఉదయం 6.40 గంటలకు ఒక సీఐ, ఎస్సైతో కూడిన సిట్ బృందం, నలుగురు ఆర్ముడు రిజర్వ్ పోలీసులు నాగరాజును కస్టడీకి తీసుకుని, విజయవాడకు తీసుకెళ్లారు.
థియేటర్‌లో మంటలు..
అనపర్తి: స్థానిక సత్యగౌరీ సినిమా థియేటర్‌లో మంటలు చెలరేగడంతో ప్రేక్షకులు కంగారు పడ్డారు. అనపర్తి అగ్నిమాపకాధికారి పలివెల శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. థియేటర్‌లో గురువారం మార్నింగ్ షో ప్రదర్శిస్తున్న ఏసీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రేక్షకులను బయటకు పంపేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. రూ.3.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా.
ఇన్నీసుపేట కోఆపరేటివ్
బ్యాంకుపై చర్యలు తీసుకోవాలి
సీటీఆర్‌ఐ: వాసంశెట్టి రమణమ్మ, వెంకట్రావు దంపతులను మోసగించి స్వాధీనం చేసుకున్న రూ.కోట్ల విలువైన స్థిరాస్తుల విషయంలో విషయంలో ఇన్నీసుపేట కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు సిబ్బంది, యాజమాన్యం పాత్రపై విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోవాలని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు జిల్లా సహకార అధికారికి ఫిర్యాదు చేశారు. స్వాధీనం చేసుకున్న వారి ఆస్తులను బాధితులకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు, వైఎస్ చైర్మన్ ఎల్వీ ప్రసాద్ బృందం బాధితులతో కలసి సహకార అధికారికి వినతిపత్రాలు సమర్పించారు. రామారావు మాట్లాడుతూ బాధితులు సదరు బ్యాంకులో 94 గజాల స్థలాన్ని కుదువ పెట్టి 1996లో రూ.50 వేలు రుణం తీసుకున్నారని, ఆ రుణాన్ని తీర్చేసినా రూ.60 లక్షలు బాకీ ఉన్నట్టు వేలి ముద్రలు తీసుకుని బ్యాంకు యాజమాన్యం మోసానికి పాల్పడినట్టు తెలిపారు.
అభ్యసన సామర్థ్యాలే లక్ష్యం
రాజమహేంద్రవరం రూరల్: విద్యార్థి కేంద్రీకృతంగా బోధన సాగాలని, అభ్యసన సామర్థ్యాల సాధనే అంతిమ లక్ష్యం కావాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మోరంపూడిలో ఉన్న బీఆర్‌కే గార్డెన్స్‌లో గురువారం ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఐటీ సిబ్బందికి సమావేశం నిర్వహించారు. పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ జి.నాగమణి అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో డీఈవోలు పాల్గొన్నారు.
1 నుంచి తక్కువ ధరకే బియ్యం
రాజమహేంద్రవరం సిటీ: నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరల్లో అందించేందుకు ఆగస్టు 1 నుంచి మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ అమలు చేయనున్నట్లు జేసీ వై.మేఘా స్వరూప్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో పారదర్శకంగా అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు.
విశాఖను మెట్రోపాలిటన్‌గా
ప్రకటించాలి
రాజమహేంద్రవరం సిటీ: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ముందే విశాఖపట్నం నగరానికి అధికారికంగా మెట్రోపాలిటన్ సిటీ హోదా కల్పిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఉమ్మడి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ గురువారం ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం చంద్రబాబుకు వినతిపత్రం సమర్పించారు.


