రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

Jul 31 2026 12:21 AM | Updated on Jul 31 2026 12:21 AM

దేవరపల్లి: పొగాకు రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైయిందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. గోపాలపురం కళ్యాణ మండపంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాజీ హోం మంత్రి తానేటి వనిత, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజాతో పాటు ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 143 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇవ్వగా, ఇప్పటి వరకు 20 శాతం పంట కూడా కొనుగోలు జరగలేదన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్‌ పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకున్నారని, సుమారు 7 వేల కోట్లు మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ తీసుకు వచ్చి గిట్టుబాటు ధర కల్పించినట్టు ఆయన తెలిపారు. సగటు ధర రూ.300 ఇస్తే తప్ప గిట్టుబాటు కాదని ఆయన అన్నారు. మాజీ హోం మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత మాట్లాడుతూ నియోజకవర్గంలో రెండు వేలం కేంద్రాల పరిధిలోని సుమారు 4 వేల మంది పొగాకు రైతులకు భరోసా కల్పించడానికి జగన్‌ వచ్చే నెల ఐదున వస్తున్నారని, దీంతో పొగాకు కిలో రూ.10కి పెంచారని తెలిపారు. ఆయన వస్తే మేలు జరుగుతుందని రైతులు నమ్మకంతో ఉన్నారని, అందువల్ల జగన్‌ పర్యటనను విజయవంతం చేయాలని ఆమె కోరారు. పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు రైతులు సమస్యల్లో ఉన్నారని, చంద్రబాబు వ్యవసాయానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. తొలుత మండల స్థాయి నాయకులతో జగన్‌ పర్యటనపై సమీక్షించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు వెలగా శ్రీరామమూర్తి, గన్నమని వెంకటేశ్వరరావు (జీవీ), పార్టీ నాయకులు కూసం రామ్మోహన్‌రెడ్డి, వల్లభనేని సత్యనారాయణ, కురుకూరి నాగేశ్వరావు, ఇళ్ల భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు కపట నిద్ర నటిస్తున్నారు

ప్రజల పట్ల చంద్రబాబు కపట నిద్ర నటిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. వచ్చే నెల 5న దేవరపల్లిలోని పొగాకు వేలం కేంద్రం సందర్శనకు వస్తున్న వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పర్యటన ఏర్పాట్లు, హెలీప్యాడ్‌ నిర్మాణాన్ని గురువారం మాజీ హోం మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనితతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కపట నిద్ర నటిస్తున్న చంద్రబాబును లేపడానికి, ప్రజల పక్షాన ఆయన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు, విశాఖపట్నం స్మార్ట్‌సిటీ మాజీ చైర్మన్‌ గన్నమని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల కృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement