ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు 39 అర్జీలు వచ్చాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో ఎస్పీ నరసింహకిశోర్ నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత స్టేషన్ల పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని సూచించారు.
పరిష్కారం చూపండి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): స్థానిక కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను సోమవారం నిర్వహించారు. ఇందులో ప్రజల నుంచి మొత్తం 246 అర్జీలు వచ్చాయి. వీటిని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.భాస్కర్‌రెడ్డి, తదితర జిల్లా అధికారులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందిన ప్రతి అర్జీని క్షేత్ర స్థాయిలో సమగ్రంగా పరిశీలించి, నిర్దిష్ట గడువులోగా నాణ్యమైన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు.
దేశ అభివృద్ధిలో
యువత పాత్ర కీలకం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జాయింట్ కలెక్టర్ మేఘాస్వరూప్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా అన్నారు. సోమవారం రాజమహేంద్రవరంలోని పోలీస్ కన్వెన్షన్ సెంటర్‌లో జిల్లా పాఠశాల, ఇంటర్ విద్యా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ‘షైనింగ్ స్టార్స్–2026‘ కార్యక్రమం జరిగింది. అసిస్టెంట్ కలెక్టర్ ఆదిత్య శర్మ, జిల్లా విద్యాశాఖ అధికారి కె.వాసుదేవరావు మాట్లాడుతూ పదో తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 142 మంది విద్యార్థులను జిల్లా స్థాయి షైనింగ్ స్టార్స్– ప్రతిభా అవార్డులకు ఎంపిక చేశామన్నారు. జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారి ఐ.శారద మాట్లాడుతూ ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 43 మంది విద్యార్థులను షైనింగ్ స్టార్స్ అవార్డులకు ఎంపిక చేశామన్నారు. వీరికి మెడల్స్, ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులను అందజేశారు.
పర్యావరణ హిత
పుష్కరాలకు ఏర్పాట్లు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): 2027లో జరగబోయే పుష్కరాలను పర్యావరణ హితంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ కీర్తి తెలిపారు. సోమవారం గోదావరి పుష్కరాల నిర్వహణపై రాష్ట్ర ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి ఆమె హాజరయ్యారు.
కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి జలాల్లో పారిశ్రామిక వ్యర్థాలు, జనావాసాల నుంచి మురుగు కలవకుండా వివిధ శాఖల సమన్వయంతో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కమిటీకి తెలిపారు. జిల్లాలో 17 రెడ్ కేటగిరీ పరిశ్రమల నుంచి వ్యర్థాలు వెలువడుతుండగా, ఇందులో రెండు పరిశ్రమల వ్యర్థాలు గోదావరిలోకి విడిచి పెడుతున్నాయని, వీటిపై చర్యలు తీసుకుంటామన్నారు. పుష్కరాల సందర్భంగా నది పొడవునా ఇరువైపులా అన్ని ఘాట్లలో నిరంతర వాటర్ క్వాలిటీ మోనిటరింగ్ చేపడతామన్నారు. అన్ని ఘాట్‌లను ప్లాస్టిక్ రహిత ఘాట్లుగా నిర్వహించనున్నామని తెలిపారు. సమావేశంలో జేసీ మేఘ స్వరూప్, కార్పొరేషన్ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు.


