చింతూరు: రంపచోడవరంలో జరుగుతున్న ఆదివాసీ మహాగర్జన సభకు తమను వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహించిన ఆదివాసీలు భారీసంఖ్యలో చింతూరు ఐటీడీఏ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం జరుగుతున్న ఈ సభకు చింతూరు డివిజన్లోని నాలుగు మండలాలకు చెందిన ఆదివాసీలు భారీ సంఖ్యలో వాహనాల్లో బయలుదేరారు. ఈ క్రమంలో చింతూరు చేరుకున్న వాహనాలను ముందుగా ఎర్రంపేటలోని ఒడిశా జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. గిరిజనులు, ఆదివాసీలు జంక్షన్ వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించడంతో పోలీసులు వాహనాలను అనుమతించారు. అలాగే పోతనపల్లి వద్ద మరోమారు వారి వాహనాలను పోలీసులు నిలిపివేశారు. దీనిపై ఆగ్రహించిన వారంతా ఐటీడీఏ వద్దకు చేరుకుని చింతూరు, మారేడుమిల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. తమ హక్కుల సాధనకోసం శాంతియుతంగా ర్యాలీ నిర్వహించేందుకు రంపచోడవరం వెళుతున్న తమను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం కాదన్నారు. తమను సభకు వెళ్లనీయకుంటే రంపచోడవరంలో త్వరలో జరిగే ముఖ్యమంత్రి సభకు పార్టీలకు అతీతంగా ఆదివాసీలు హాజరవకుండా చూస్తామంటూ వారు హెచ్చరించారు. సుమారు రెండు గంటలపాటు రహదారికి ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆందోళన విషయం తెలుసుకున్న ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్, ఏఎస్పీ బొడ్డు హేమంత్ ఆందోళనకారులతో చర్చలు జరిపారు. రంపచోడవరం సభకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో ఆదివాసీలు ఆందోళన విరమించి వాహనాల్లో సభకు పయనమయ్యారు.


